Facebook Twitter
ఇది శాంతి వనం...? అది రణక్షేత్రం..?

ఇక్కడ...
ఇళ్ళల్లో ఇనుప బీరువాల్లో
మిళ మిళ మెరిసే కరెన్సీ కట్టలే...

అక్కడ...
ఇజ్రాయెల్ గాజా
వీధుల్లో ఎక్కడ
చూసినా అనాధ శవాల గుట్టలే...

ఇక్కడ...
గుళ్ళు గోపురాల్లో దేవుళ్ళకు
పాలబిందెలతో పాలాభిషేకమే...

అక్కడ... ఎక్కడ విన్నా
శరణార్ధుల శిభిరాలలో
పాలులేక ఆకలితో గుక్కపెట్టి ఏడ్చే
పాలస్తీనా పసికందుల ఆక్రందనలే...

ఇక్కడ...
ఏసీ గదుల్లో...
విలాసవంతమైన
విల్లాలలో.‌..హాయిగా
నిద్రించే అదృష్టవంతులే...

అక్కడ...
భయంకరమైన బాంబు
దాడుల్లో...కుప్పకూలిన
భారీ భవన శిధిలాలలో...
చిక్కుకున్న క్షతగాత్రులే...
ఆకలికి అలమటించే అస్థిపంజరాలే...

ఇక్కడ...
రుచికరమైన
విందులు వినోదాలే...
చిరునవ్వులతో చిందులే...

అక్కడ... 
ఇజ్రాయెల్ సైనికుల భయంకరమైన
బాంబుదాడులకు ప్రాణభయంతో
గజగజ వణుకుతున్న గాజా ప్రజలు
రక్తపుమడుగులో గిలగిలలాడతూ...
కొన ఊపిరితో కొట్టుకులాడుతూ...
అల్లాఅల్లా అంటూ గుండెలు పగిలేలా రోదించే...బంధువులే...ఆపద్బాంధవులే...

ఇది ప్రేమ కరుణ త్యాగం
పాలూ తేనెలై ప్రవహించే...
శాంతి కపోతాలు ఎగిరే...రామరాజ్యం
స్వేచ్ఛా స్వాతంత్ర్యం సమానత్వం సౌభ్రాతృత్వం దీని జీవన వేదం...

అది రాక్షసులు తిరిగే...
రాబందులు ఎగిరే...రావణరాజ్యం
సమరం సామ్రాజ్యవాదం
శత్రృనాశనం రక్తపాతం దాని నినాదం...

ఔను ఇది ఒక శాంతివనం...!
అది ఒక రణక్షేత్రం...!!
ఇది నా భారతదేశం
ఇది నా జన్మ భూమి
ఇది నా పుణ్యభూమి...
అది రక్తపుటేరులు ప్రవహించే
ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్దభూమి...
జై హింద్... జై భారత్...