అమ్మా ! ఓ భరతమాతా !
ఇదెక్కడ పశుధర్మం ?
భారతీయులందరూ
నా సహోదరులే అన్నవారే
ఏపరస్ర్రీ ఐనా తనకు
చెల్లితో అక్కతో తల్లితో
సమానమన్నవారే
తమవారిమీద ఈగవాలితో
ఒప్పుకోనివారే
పరాయి అమ్మాయిలు
కంటపడితే చాలు
"కుక్కల్లా" వెంటపడతున్నారే
కామంతో రగిలిపోతున్నారే
"అన్నా అన్నా" అంటూ
తోబుట్టువుల్లా వేడుకున్నా
పాడుచేయెద్దని పాదాలకు మొక్కినా
"కనికరించని ఆ కామాంధులు"
మౌనంగా మానభంగానికి
మద్దతివ్వనందుకు
తప్పించుకునే దారిలేక
ఎదురు తిరిగినందుకు
"నాలుకలు తెగకోస్తున్నారే"
రాక్షసులై మర్మాంగాలతో
రాచక్రీడలాడుకుంటున్నారే
లొంగకపోతే
చిత్రహింసలకు గురిచేసి
అమానుషంగా అనుభవించి
"కూడుతిన్నకుక్కలు"
కుండను కూడాపగలగొట్టినట్లు,
ఒంటిమీద "యాసిడ్" పోస్తున్నారే
"పెట్రోలుపోసి "తగలపెడుతున్నారే
నిర్భయంగా నిర్దాక్షిణ్యంగా
"అర్థరాత్రిలో అంత్యక్రియలు"
నిర్వహిస్తున్నారే, సాక్ష్యాలను
సజీవంగా దహనం చేస్తున్నారే
ఛీ ! ఛీ ! వీరు మనుషులేనా ?
కాదు కాదు "మానవ మృగాలు"
"రాతిగుండెల రాక్షసులు"
అమ్మా ! ఓ సాగరమాతా!
ఒక్కసారి ఉప్పొంగి
ఈ కామాంధులను
నీ గర్భంలో చేర్చుకోవమ్మా !
అమ్మా ! ఓ నేల తల్లీ!
ఒక్కసారి బ్రద్దలై
ఈ భ్రష్టుల్ని దుష్టుల్ని
నీలో కలుపుకోవమ్మా,!
మేమెందుకిలా
శపిస్తున్నామంటే
మా చట్టాలు చేయలేని
పనులు మీరు చేస్తారని...
ఈ సమాజంలో స్వేచ్చగా తిరిగే
ఈ మానవమృగాలకు
మా న్యాయమూర్తులు వేయలేని
కఠినమైన శిక్షలు మీరు వేస్తారని
క్షణాల్లో ప్రాణాలు తీస్తారని
చట్టాలు మాచుట్టాలంటున్న
కళ్ళుపొరలు కమ్మిన కామాంధులకు
గట్టిగా బుద్ది చెబుతారని...
గుణపాఠాలు నేర్పుతారని....
లేదంటే మేమే కలకత్తా కాళికలమై
కామాంధుల కుత్తుకలు త్రెంచేస్తాం...
లేదంటే మేమే ఉరితాళ్ళు సిద్దం చేసి
ఉన్మాదులను ఉరికంభానికి వ్రేలాడతీస్తాం...



