Facebook Twitter
నేనొక ఆశా జీవిని

బండరాయి క్రింద పడి 

నలిగి నలిగి నుజ్జు నుజ్జైన 

        - గండు చీమను నేను 

వేడి వేడి గంజిలో పడి 

గింజుకుంటున్న

గిలగిల కొట్టుకుంటున్న 

         - మూగ ఈగను నేను 

కసిపట్టి బుసలు కొట్టి  కాటువేసే 

కోడెనాగు కాళ్ళముందే వచ్చిపడ్డ 

           - గుడ్డి కప్పను నేను 

వేటాడొద్దు వేటాడొద్దు అంటూ 

అడవిలోని సింహాలను 

చిరుత పులుల్ని వేడుకుంటున్న 

            - వెర్రి జింకను నేను 

ఆకలికి ఆగలేక,

కత్తులు నూరే కసాయివాడు

విసిరే పచ్చి ఆకులు మేసే 

               - పిచ్చి మేకను నేను  

అయినా నేనో ఆశాజీవిని 

ఎందుకంటే 

ట్రాఫిక్ లో ఇరుక్కున్న ప్రతిసారి

ఎదురుగా వున్న ఎర్రలైటు నాతో  

అంటుంది నా వెనుకే గ్రీన్ లైటుంంది

                - కొద్దిగ ఓపిక పట్టమని

అందుకే నాకో గట్టి నమ్మకం వుంది 

కారుమబ్బుల్ని చీల్చుకుంటూ

ఖచ్చితంగా సూర్యుడు ఉదయిస్తాడని

నాకంటూ ఓ మంచి రోజూ తప్పక వస్తుందని 

విధిని ఎదిరిస్తానని విజయం సాధిస్తానని