నిన్ను నీవు
నిందించుకుంటే
పతనం తప్పదు
నిన్ను నీవు
ద్వేషించుకుంటే
దుర్గతి తప్పదు, కానీ
నిన్ను నీవు
ప్రేమించుకుంటే
ప్రమిదవై వెలుగిపోతావు
నిన్ను నీవు మెచ్చుకుంటే
జింకవై చెంగున దూకేస్తావు
నిన్ను నీవు
వెన్ను తట్టుకుంటే
భుజంపై కొట్టుకుంటే
శహబాష్ అనుకుంటే
ముందుకు నెట్టుకుంటే
నీవు సింహమైపోతావు
అడవికి రాజువైపోతావు
నీవు గరుడపక్షివైపోతావు
సప్తసముద్రాలనే దాటేస్తావు
ఒక్కసారి
నీలోకి తొంగిచూడు
నీ అంతరంగాన్ని అణ్వేషించు
ప్రజ్వలించే నీ ఆత్మనుదర్శించు
ఉంది, నీలోనే నీ ఆత్మలోనే
అనంతమైన శక్తి దాగివుంది
నీవీ పరమసత్యాన్ని గ్రహించిననాడు
నీకిక ఎదురేలేదు ఏటికెదురీదగలవు
రామబాణమై దూసుకుపోగలవు
అరుణోదయకిరణమై చొచ్చుకుపోగలవు
ఎవరెస్టు శిఖరాన్ని
అవలీలగా అధిరోహించగలవు
ఖణఖణ మండే
అగ్నిగుండంలో దూకగలవు
కొండలను పిండిచేయగలవు
వీరుడివై విజయకాంక్షతో
రగిలిపోగలవు
విధిని ఎదురించగలవు
దానిగుండెల్లో నిదురించగలవు
విజయాన్ని సాధించగలవు
ప్రపంచ రికార్డుల్ని
బ్రద్దలు కొట్టగలవు
విశ్వవిజేతవై నీవు
కీర్తికిరీటాన్ని ధరించగలవు
కురిసే ప్రశంసల కుంభవర్షంలో
తడిసి తడిసి ముద్దైపోగలవు
ఉడుకు రక్తముప్పొంగే ఓ యువకా
నాడు చరిత్రలో సువర్ణాక్షరాలతో
లిఖించ బడుతుంది నీ ఈ ఘనకీర్తి
ముందుతరాలకు నీవే గొప్ప స్ఫూర్తి



