Facebook Twitter
వద్దువద్దు ఆత్మహత్యలకు పాల్పడవద్దు

ఆత్మహత్యలకు సిద్దపడే

ఓ అజ్ఞానులారా ! అవివేకులారా !

ఓ అమాయకులారా ! నవయువకులారా !

ఆవేశంలో, మొండితనంతో

మీరు కూర్చున్న కొమ్మను మీరే నరుక్కుంటారు

మీ కంటిని మీరే పొడుచుకుంటారు

మీ ఇంటికి మీరే నిప్పు పెట్టుకుంటారు

మీ గొయ్యిని మీరే తవ్వుకుంటారు

మీ సమాధిని మీరే కట్టుకుంటారు

అందుకే మీరు అంధులు పిరికిపందలు

 

సమస్యలు ఎదురైతే ఒక వీరునిలా 

చిట్టచివరి శ్వాస వరకు పోరాడాలి

ఆవేశపడి చచ్చి సాధించేది ఏముంది?

చావు సమస్యలకు పరిష్కారం కానేకాదు

 

మిమ్మును అణగదొక్కేవారికి 

మీ అభివృద్ధిని, మీ పచ్చదనాన్ని 

చూసి ఓర్వలేనివారికి,విమర్శించేవారికి

అకారణంగా నిందలు వేసేవారికి

మానసికంగా హింసించినవారికి

 

మిమ్మల్ని చిన్నచూపు చూసేవారికి

నమ్మించి నట్టేటముంచేవారికి

వెనుక లోతుగా గోతులు త్రవ్వేవారికి

మీ చావుకోసం నిత్యం ఎదురు చూసేవారికి

మీరు అకస్మాత్తుగా చీకటిలోకి వెళ్ళిపోతే

మీ పతనాన్ని కోరుకునే వారికి పండగే కదా

 

అసలు ఈ జీవితమే ఒక యుద్ధరంగం

శత్రువులతో పోరాడాలి పోరాడి గెలవాలి

వెర్రివారిలా వెనుతిరగిపోరాదు

పిరికి పందల్లా పారిపోరాదు

చిట్టచివరి రక్తపు బొట్టువరకు 

చివరి శ్వాస వరకు పోరాడాలి

బద్దవిరోధులందరికి బుద్ది చెప్పాలి

గుడ్డిగా విమర్శించేవారికి గుణపాఠం నేర్పాలి

అప్పుడే మీ జన్మకు సార్థకత

అప్పుడే మీ చావుకు ఒక అర్థం

 

పరీక్షలో ఫెయిలైనందుకో

ప్రేమ విఫలమైనందుకో

వ్యయసాయంలోనో, వ్యాపారంలోనో 

భారీగా నష్టం వచ్చినందుకో

ఏ పురుగుమందు త్రాగో

ఏ ఫ్యానుకు ఉరివేసుకొనో 

ఏ ఎత్తైన బిల్డింగ్ పైకెక్కిదూకో

 

ఛస్తే ఏముంది ?

కట్టై స్మశానంలో కాలడం తప్ప

కన్నతల్లిదండ్రులకు గుండెకోత తప్ప

వద్దు వద్దు ఆత్మహత్యలకు పాల్పడవద్దు

మీబంగారు భవిష్యత్తును బలిచేసుకోవద్దు