Facebook Twitter
కీచకులకు కిరీటాలు..? క్రీడాకారుల పతకాలు గంగపాలు...?

ఎన్నో ఏళ్లుగా...
ఎంతో కఠోర పరిశ్రమ చేసి...
కఠినమైన శిక్షణతో...గట్టి ప్రణాళికతో
అకుంఠితదీక్షతో...అంకితభావంతో
సాధన చేసి...సరిహద్దులను చెరిపేసి... విదేశాలలో  రెజ్లింగ్ పోటీలలో
ప్రత్యర్థులను...మట్టి కరిపించి‌..‌.
విజయకేతనం...ఎగురవేసి...
ఒలింపిక్స్ ఏషియన్ గేమ్స్ లో
బంగారు పతకాలపంట...పండించిన
మహావీరులు...మన రెజ్లింగ్ క్రీడాకారులు

మేరా భారత్ మహానంటూ....
దిక్కులు పిక్కటిల్లేల నినాదాలు చేస్తూ...
నిండుగా త్రివర్ణపతాకాన్ని కప్పుకొని...
మరో త్రివర్ణపతాకం అనంత ఆకాశంలో
గర్వంగా రెపరెపలాడగా...భరతజాతి
ఘనకీర్తిని ఖండఖండాంతరాలకు
విస్తరింప జేసిన...విశ్వవిజేతలు...
జాతిరత్నాలు...మన రెజ్లింగ్ క్రీడాకారులు

తమ రక్తాన్ని స్వేదంగా మార్చి
అద్వితీయమైన...అసాధారణ ప్రతిభతో
సాధించిన ఆ బంగారు పతకాలు
అయ్యో ! అయ్యో ! గంగ పాలా...?
మహిళా క్రీడాకారులపై లైంగిక వేధింపులా?
దోషిని శిక్షించేందుకు దోబూచులాటలా..?
ఇదెక్కడి ధర్మం..? ఇదేమి న్యాయం..?
ఇదేమి ప్రభుత్వం.? ఇదేమి ప్రజాస్వామ్యం.?

అహంకారంతో...
అధికార దాహంతో...విర్రవీగుతూ...
కామంతో...కళ్ళు పొరలుకమ్మి...
తల్లి భరతమాత...తలదించుకునేలా...
మహిళా క్రీడాకారులను
మానభంగాలకు గురిచేసే...
మానసికంగా కృంగ దీసే...
రహస్యంగా లైంగికంగా వేధించే 
రాక్షసుల్ని...కోయాలి...రంపాలతో...
కీచకుల్ని...పంపాలి...కారాగారానికైనా... 
కామాంధులను...కాల్చాలి...కాటిలోనైనా...
మద్దతు పలకాలి...మానవతావాదులంతా
అప్పుడే మనశ్శాంతి...రెజ్లింగ్ క్రీడాకారులకు
అప్పుడే ఆత్మశాంతి....తల్లి భారత మాతకు