Facebook Twitter
కీచకులు...క్రీడాకారులు…

అయ్యో కళ్ళముందే...
ధర్మం ధగ్దమైపోతుందే...
నడిరోడ్డులోనే...న్యాయం...
నవ్వులపాలైపోతుందే...
దిక్కులేని శవమై పడివుందే...
ఇదేమి రాజ్యం..? ఇదేమి చోద్యం..?
ఇదేమి ధర్మం..? ఇదేమి న్యాయం..?

మహిళలంటే మహారాణులే...
మహిళలంటే ఇంటికి దీపాలే...
మహిళలంటే మాతృమూర్తులే...
అట్టివారిపై ఏలారా ..?
ఈ లైంగిక వేధింపులు...?
మతిలేని ఈ మానభంగాలు..?
ఇదెక్కడి ప్రజాస్వామ్యం..?

నీచ...నికృష్ట...దుష్ట...దుర్మార్గ
ధూర్తులపై...మూర్ఖపుమూకలపై...
రహస్యంగా...లైంగికంగా వేధించే
రాక్షసులపై...కఠినచర్యలు తీసుకోవాలని...

సిగ్గిడిచి ఇండియా గేట్ ముందు
ధర్నాచేసే ధర్మపోరాటం చేసే మహిళలపై
మానవత్వం లేకుండా లాఠీచార్జీలా..?
ఇదేమి ధర్మం..? ఇదేమి న్యాయం..?
ఇదేమి రాజ్యం..?ఇదేమి ప్రజాస్వామ్యం..?

మానవత్వంలేని
ఓ మనుషుల్లారా..!
మీరు పశువులుగా..!
కామాంధులుగా మారకండి..!
మహిళామణులను గౌరవించండి..!
స్త్రీలు ఆదిపరాశక్తులని మరువకండి..!

కలికి కన్నీరును తుడవని
ఏ ప్రభుత్వమైనా..?ఎంతటి నేతలైనా..? కాలగర్భంలో కలిసి పోవాల్సిందే...
క్షణంలో కనుమరుగై పోవలసిందే...
ఇది చరిత్ర చెబుతున్న అక్షరసత్యం

ఔను ప్రభుత్వఅధికారులు స్పందించాలి
నిప్పులాంటి ఒక నిర్ణయం తీసుకోవాలి
తప్పు చేసిన వారిని తక్షణమే శిక్షించాలి
న్యాయపోరాటం చేస్తున్న రెజ్లర్ల సమస్యను
సానుకూలంగా శాశ్వతంగా పరిష్కరించాలి