కొందరు
పల్లెటూళ్ళలో
నక్కనక్కి
తిరుగుతువుంటారు
మేకవన్నె పులుల్లా...
తేనెపూసిన కత్తుల్లా...
పాపం
ఆ పల్లెటూళ్ళలో
ఆ పల్లెప్రజల
ఆకలిని అజ్ఞానాన్ని
అమాయకత్వాన్ని
ఆసరాగా చేసుకుని
ఆ పల్లె ప్రజల
మంచితనాన్ని
బలహీనతగా భావించి
వారి పేదరికాన్ని
పెట్టుబడిగా మార్చుకొని
వారి పొలము పుట్రా
నగదు నట్రా
వారి పంటపొలాలను
ఇంటి స్థలాలను
వారి ఆవులను
ఊట బావులను
వారి గొర్రెలను
పాలిచ్చే బర్రెలను
దొంగల్లా...దోచుకొని
దాచుకొని...
దొరల్లా...దర్జాగా...
తిరుగుతువుంటారు ...
ఆ పల్లె ప్రజలకు
అవసరానికి
అప్పులిస్తారు
ఆదుకుంటారు
ఆ పైవడ్డీ మీద
వడ్డీవేసి నడ్డివిరుస్తారు
కౌగలించుకుంటారు
కానీ కడుపులో పదునైన
కత్తులుంచుకుంటారు
ఆ పల్లెప్రజల బంధువులను
వారి కుటుంబ సభ్యులను
వారికి బద్ద శత్రువులను చేసి
కలతలే లేని కలహాలే రాని
కలిసిమెలిసున్నవారందర్ని
కత్తులు నూరుకునేలా
కుత్తుకలు త్రెంచుకునేలా చేస్తారు
ఆపదలో ఆదుకొంటారు
ఆపద్బాంధవులమనిపించుకొంటారు
కరుణించే దైవాలని నమ్మిస్తారు
ఆపై లోతుగా గోతులు త్రవ్వుతారు
నవ్వుతూనే నట్టేట ముంచేస్తారు
బ్రతకాలని ప్రార్థన చేస్తారు
కానీ చచ్చేందుకు మందులిస్తారు
పొమ్మనకుండా వారికి పొగపెడతారు...
ఆ పల్లె ప్రజల
తలలపై కెక్కుతారు
పాపం వారిని
పాతాళానికి అణగద్రొక్కుతారు
వారి పీకలు నొక్కుతారు
వారిని మూగవాళ్ళని ముద్ర వేస్తారు
వారిపైకి వలలు విసురుతారు
వారి కమ్మనికలల తలలు కోసేస్తారు
పాపం వారిని మరో వెయ్యి ఏళ్ళకైనా
పైకి రానివ్వక ఊబిలోనే సమాధి చేస్తారు
అందుకే ఓ అమాయకపు జనమా !
ఇప్పటికైనా సమయం మించి పోలేదు
ఇకనైనా ఈ ఆధునిక యుగంలోనైనా
కొంచెమైనా మారండి విద్యావంతులుకండి !
అనాదిగా మోసపోయిన మీరు
ఈ కంప్యూటర్ యుగంలోనైనా కళ్ళుతెరవండి !
మీ హక్కులను కాలరాసే
దుష్టదుర్మార్గులపై సమిష్టిగా
పోరును సలపండి !
నోరు తెరిచి ప్రశ్నించండి !
పిడికిలి బిగించి ప్రతిఘటించండి !
ఉద్యమిస్తే ఉషోదయం మీదే ! విశ్వవిజేతలు మీరే !
మిమ్మల్ని వారు పక్షుల్లా స్వేచ్చగా ఎగరనివ్వరు !
మిమ్మల్ని వారు వృక్షాల్లా పచ్చగా ఎదగనివ్వరు !
మనుషులుగా మారనివ్వరు!
ప్రశాంతంగా బ్రతకనివ్వరు!
అందుకే జాగ్రత్త !
ఓ పల్లె ప్రజలారా ! తస్మాత్ జాగ్రత్త !!



