Facebook Twitter
ఉద్యమాలతోనే ఉషోదయం

కన్నవాడే కసాయి వాడైతే 
ఆ కన్నబిడ్డలను ఆదుకునేదెవరు ?
కట్టుకున్నవాడే కర్కోటకుడైతే
ఆ స్త్రీకి దిక్కెవరు ?
ఎందుకు ఈ క్రూరత్వం ?
ఎంతకాలం ఈ కుట్రలు కుతంత్రాలు ?
ఏమిటీ సవితితల్లి ప్రేమ ?
ఎంతకాలం ఈ నటన ?

కంచే చేను మేస్తే
చేను మేనులో పూనకం పుట్టదా?
పండిన పంట కంట నీరు పెట్టదా?
నిన్న అమ్మ పాలే శ్రేష్టమన్నవారే
నేడు డబ్బాపాలే  శ్రేష్టమనిఢంకా మ్రోగిస్తున్నారే
వెలుగును వెతుకుతూ సూర్యునికి చుట్టాలైనవారిని
వేదనకు బలిచేస్తున్నారే వెతలకు గురిచేస్తున్నారే
కారు చీకటిలోకి నెట్టివేస్తున్నారే, అతుకుల
గతుకుల బ్రతుకుల్లో కారుచిచ్చు రేపుతున్నారే
ఇదేమి న్యాయం ? ఇదెక్కడి ధర్మం ?

నేడు పాలకులు చేసిన పాపం
రేపు కాలసర్పమై కాటువేయదా?
నిగ్రహం కోల్పోయిన ప్రజలు ఆగ్రహిస్తే
రెప్పపాటున ప్రభుత్వాలు కుప్పకూలిపోవా?
చరిత్ర విప్పి చెప్పే ఈ గుణపాఠాలు
గుర్తుంచుకోని వారంతా గుడ్డివారు కాదా?
విశాఖ ప్రైవేటీకరణతో బడుగు బలహీన వర్గాల
కార్మికుల బ్రతుకులు "చితికి"పోవా? "చితికి"చేరవా?
అధికారులే అంధులైతే...అహంకారులైతే
ఉద్యమాలతోనే ప్రజలజీవితాల్లో ఉషోదయం