Facebook Twitter
ఏమైంది ? ఏమైంది?

నాటి మీ "ధీరత్వం వీరత్వం"
నాటి మన్యం వీరుడు అడవి బెబ్బులి
"అల్లూరి సీతారామరాజు" "పోరాట పటిమ"

ఏమైంది ? ఏమైంది? ఆంధ్రావతరణకోసం
నాడు "పొట్టి శ్రీరాములు" చేపట్టిన
ఆమరణ నిరాహారదీక్షల "ఆత్మత్యాగం"

ఏమైంది? ఏమైంది? మరతుపాకులు ఎక్కుపెట్టి
బెదిరించినా ఆంగ్లేయుల గుండెల్లో నిదురించిన
నాటి "టంగుటూరి ప్రకాశం" "వీరాఆవేశం"

ఎన్నో ఎత్తులతో జిత్తులతో
నాటి కేంద్ర ప్రభుత్వం
ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కుట్రలుపన్ని కూలద్రోసిననాడు
"ఆత్మగౌరవం" నినాదంతో
"తెలుగుజాతి" ఒక్కటై
నిప్పులు కురిపించిన, సునామీలా విరుచుకుపడిన
వీరోచితంగా పోరాడి గెలిచిన
ఓ ఆంధ్రవీరులారా ? ఎక్కడ? మీరెక్కడ?
ఎక్కడ ? ఎక్కడ ?
నాటి "ఆ ఉద్యమ ఉడుకురక్తం"

కానీ,ఒక్కపచ్చినిజం మాత్రం గుర్తుంచుకోండి 
మీరు పిడికిలి బిగించి కత్తులై కదంతొక్కితేనే
ఈ విశాఖ "విషవిపత్తు "నుండి
మీకు విముక్తి

అందుకే "డూ ఆర్ డై"
అన్న నాటి గాంధీజీ
"స్వాతంత్ర్య నినాదమే"
నేటి మీ నినాదం కావాలి

"పదండి పోదాం పదండి
పోదాం పైపైకి" అన్న
"మహాకవి శ్రీశ్రీ" నాడు నింపిన ఉద్యమస్పూర్తితో
ముందుకు ఉరికి సమిష్టిపోరాటానికి సిద్దమౌతారో...

ప్రైవేటికరణ పాటే మళ్ళీమళ్ళీ పాడే
ఢిల్లీపీఠానికి ఆంధ్రుల
ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతారో...

ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకై తెరవెనుక జరిగే కుట్రలకు

కుతంత్రాలకు సమిధలౌతారో కారకులకు సమాధికడతారో...

భావితరాల యువత భవితను బలిఇస్తారో...
అగ్నిజ్వాలలై రగిలిపోతారో... ఊసరవెళ్ళుల...
రెండునాల్కల నేతల భరతం పడతారో...మీరే తేల్చుకోండి

ఆలస్యం చేస్తే ఆంధ్రుల ఆత్మగౌరవం...అగ్నిపాలే
అందుకే ఓపిక ఉన్నంతవరకు
ఊపిరి ఉన్నంతవరకు
కాల రాసిన హక్కులకోసం ఉక్కుసంకల్పంతో
ఉద్యమిస్తే అఖండ విజయం మనదే...మనదే...మనదే !
విశాఖ ఉక్కు మనకే...
మనకే...మనకే...జై తెలుగుతల్లి !