Facebook Twitter
స్వాగతం పలకకే ఓ శ్మశానమా !

ఒకనాడు కడుపేదరికంలో

దారిద్ర్యంలో దగ్ధమైన మనిషి

నేడు ధనవంతుడయ్యాడు,కాని

దానకర్ణుడు కాలేకపోయాడు

దొంగచాటుగా దోచుకున్నది

బ్యాంకుల్లో భద్రంగా దాచుకున్నది

ఎలా పట్టుకెల్లాలో

అర్థంకాక జుట్టు పీక్కుంటున్నాడు

 

సమాధిలో ఎలా దాచుకోవాలో

ఏమి చేయాలో అర్థంకాక

ఎవరికీ వినపడకుండా

కన్నీళ్ళు‌ ఎవరికీ కనపడకుండా

చీకటిలో కుర్చొని చింతిస్తున్నాడు

కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ... ఏడుస్తూ

కుప్పకూలిపోయాడంతే...

రెప్ప మూయలేదు... ఇంకా... 

బ్రతికే వున్నాడు...

అందుకే తొందరపడి....

స్వాగతం పలకకే ఓ శ్మశానమా !

 

కాటికాడి కాకులు రమ్మంటున్నా

కన్పబిడ్డలే కాటికి పొమ్మంటున్నా

రాత్రింబవళ్ళు తన రక్తాన్ని ధారబోసి 

అష్టకష్టాలుపడి ఆర్జించిన ఆస్తినంతా

ఒక్కరోజు కూడా...ఒక్కగంట కూడా...

ఒక్క చెమటచుక్కనైనా కార్చని... 

కాయకష్టమంటే ఏంటో ఎరుగని...

ఒక్కపూటైనా కడుపు నిండా

కన్నతల్లిదండ్రులకింత తిండిబెట్టని.... 

పరమ ఆశబోతులైన...దుష్టులైన...

దుర్మార్గులైన... దురాశాపరులైన...

 

కన్నవారిమీద ప్రేమలేని కఠినాత్ములైన...

కరుణ జాలిలేని కర్కశహృదయులైన...

ఈ కన్నబిడ్డల చేతుల్లో 

ఎలాపెట్టాలో అర్థంకాక

మదనపడి‌... మదనపడి...

మంచాన పడిపోయాడంతే...

మరణించలేదు...ఇంకా ....

మాట్లాడుతూనేవున్నాడు...

అందుకే తొందరపడి...

స్వాగతం పలకకే ఓ శ్మశానమా !

 

ఈ జంజాటానికి ఈ ఆశలఆరాటానికి

ఈ జీన్మరణ పోరాటానికి కారణమొక్కటే

పోతూపోతూ పట్టుకు పోవడానికి...

వస్తూవస్తూ తానేమీ తేలేదన్న వాస్తవం ఎరుగక...

నాదినాది అనుకున్నదేదీ నీదికాదన్న నిజం తెలియక...