చేదైనా సరే
ఒక నిజం చెప్పుకోవాలి
ఆ భార్యాభర్తలవి
బక్కరిక్షావాళ్ళు
భయపడే భారీశరీరాలే...
పుణ్యం పురుషార్థమాశించి
గుడిలో పూజలు ప్రదక్షిణలు
చేయ భక్తితో బయలు దేరారు
భార్యాభర్తలిద్దరు
పిసనారీతనంలో పిహెచ్ డీ చేశారు..
బేరమాడకుండా వస్తువులు కొనడం
వారి ఇంటా వంటాలేదు.....
ఇంటినుండి గుడిదాక బేరాలే
రిక్షావాడితో బేరం...
పూలు పళ్ళు కొబ్బరికాయలు
కొనేవారితో బేరం...
గుడిముందర అడుక్కునే
బిక్షగాళ్ళ దగ్గర బేరం...
గుడిలో పూజారి హారతి
పళ్ళెంలో వేసేదక్షిణ దగ్గర బేరం....
చివరికి సాక్షాత్తు భగవంతునితోనే బేరం
గుండెపోటులాంటి రోగాలు రాకుండా చేస్తే
గుడికివచ్చి గుండుకొట్టించుకొంటామని
నూటొక్క ప్రదక్షిణలు చేస్తామని వింతబేరం
దర్శనం చక్కగా జరిగినా ఆతృప్తి అరక్షణం
చేదైనా సరే ఒక నిజం చెప్పుకోవాలి
గుడిబయటకురాగానే గూబగుయ్ మన్నది
గుండెపోటు వచ్చినంతపనైంది
చెంపచెల్లుమన్నది కొంపకొల్లేరైంది
భార్య చెప్పు తెగిపోయింది
భర్త ఖరీదైన కొత్త షూస్
దొంగలెత్తుకుపోయారు
ఐనా వారి బుద్ధిమారలేదు
మళ్ళీపాతచెప్పుకుట్టే వాడితోబేరం
కొత్త చెప్పులు కొంటూ బేరం
ఇళ్ళు చాలా దూరం, అందుకే
ఆటోడ్రైవర్ తో అరగంటబేరం..పాపం
ఇంటిమలుపు దగ్గర రెండు ఆటోలుఢీ
చేదైనా సరే ఒక నిజం చెప్పుకోవాలి
ఆటో తిరగబడి భర్తకుడికాలు విరిగింది
భార్య ఎడమచెయ్యి విరిగింది
తిరిగి అదేఆటోలో ఆసుపత్రికి ప్రయాణం
ఆసుపత్రిలో వారి బేరాలన్నీ బంద్
డాక్టర్ ఫీజు....నో బేరం
మందులషాపులో... నో బేరం
ఆసుపత్రి బిల్లులో...నో బేరం
ఈ బేరాల వల్లే వారికి జ్ఞానోదయమైంది
మిగిలిందానికన్న చేతికి తగిలిందే మిన్న
ఆగుడే వారికొక గొప్ప గుణపాఠం నేర్పింది
చేదైనా సరే ఒక నిజం చెప్పుకోవాలి
దానవత్వమే దైవత్వమని..............
మంచితనమే మానవత్వమని.......
చిత్తశుద్ధిలేని శివపూజలు శుద్ధదండగని....



