Facebook Twitter
రాణిగారికి ముద్దుపెట్టిన రామచిలుక!

ఓ బంగరు రంగుల రామచిలుక ! నా

రామచిలుక ! ఎక్కడ ఎగురుచుంటివి ?

రాజుగారి తోటలో విహరించుచుంటిని

రాజుగారి తోటలో విహరిస్తు ఏమిచేస్తివి ?

నా కిష్టమైన జామపళ్ళు కొరికి తింటిని

 

జాంపళ్ళు తిన్న నిన్ను భటులేమిచేసిరి ?

పట్టుకెళ్ళి మహారాణి మందిరంలో వేసిరి

అప్పుడు రాణిగారొచ్చి ఏమి చేసిరి ?

పెద్ద పంజరంలో నన్ను బంధించి వేసిరి

 

అయ్యే ! ఓ రంగుల రామచిలుకా ! బంధీవై 

నీవేమి చేసితివి ? ఆకలేసి అల్లరిచేస్తిని

అప్పుడు రాణిగారొచ్చి ఏమిచ్చిరి ?

మంచిఫలము లిచ్చిరి ముద్దులిచ్చిరి

 

రాణిగారు ముద్దుపెట్టగా నీవేమిచేస్తివి ?

రాణిగారి బుగ్గమీద నేచిన్నగాటు పెడితిని

భగ్గుమన్న రాజుగారు నీకేమి శిక్షవేసిరి ?

మళ్ళీ నన్ను పంజరంలో బంధించి చేసిరి

 

అయ్యో ! ఓ రంగుల రామచిలుక !

బంధీవై మళ్ళీ నీవేమి చేస్తివి ?

పంజరం నుండే మంచిపాట పాడితిని

ఏ మాపాట కొంచెం పాడి వినిపించవా!

 

"ఓ బంగరు రంగుల చిలకా పలకవా...

ఓ అల్లరి చూపుల రాజా ఏమనీ....

నాపైన ప్రేమే ఉందని  ఈఈఈ...

నా పైన అలకే లేదని‌  ఈఈఈ."

 

పాటకు పరవశించిన రాజు రాణి ఏమిచ్చిరి?

మెచ్చుకొని ఓ బంగారుహారం మెళ్ళోవేసిరి

ఓ బంగరు రంగుల రామచిలుక ! నీవేమిచేస్తివి?

నేనలిగి.....మూతిని ......ముడుచుకుంటిని

 

రాణిగారు ముద్దుపెట్టి అలకెందుకని అడిగింది

ఓ రంగుల రామచిలుక ! మరి నీవేమి కోరితివి ?

ఆకాశాన...హాయిగా...పిచ్చిగా...తిరగాలంటిని

గాలిలో ఎగరాలంటిని ఆడుకోవాలంటిని అంతే

రాజు రాణి నవ్వి నన్ను ఆకాశంలో ఎగురవేసిరి

 

ఇప్పుడు నేనాకాశంలో ఎంతో ఎత్తులో హాయిగా

హాయి హాయిగా ఎంతో స్వేచ్చగా ఎగురుతుంటినీ

అంతఃపురంలో కన్న...స్వేచ్చ... ఆకాశంలో మిన్న

అన్న ఒకచిన్న‌‌ నగ్నసత్యం నేడు తెలుసుకుంటిని