నాటి మహాకవి శ్రీశ్రీ ప్రభోదగీతం
నేటికీ నవజీవన సంగీతమే
అది సజీవనది సందేశమే ...
"పాడవోయి భారతీయుడా
ఆడి పాడవోయి విజయగీతికా
ఆకాశం అందుకునే ధరలొకవైపు
అంతులేని నిరుద్యోగం ఇంకొకవైపు
అవినీతి బంధుప్రీతి చీకటిబజారు
అలముకొన్న నీదేశం ఎటుదిగజారు
కాంచవోయి నేటి దుస్థితి
ఎదిరించవోయి ఈ పరిస్థితి"అంటూ
ఆ మహాకవి వ్రాసిన ఆ మధురగీతం
జలజల పారే జలపాతం
మరిచిపోలేని ఒక మధుర జ్ఞాపకం
మహామహా నేతలెందరో
అరచేతిలో స్వర్గం చూపించి
అధికార పీఠమధిరోహించినా
పరిపాలించే హస్తాలు మారినా
సుపరిపాలన శూన్యమాయె
నిరుపేదల నిరుద్యోగుల మధ్యతరగతి
ప్రజల జీవితాల్లోపొరలాయే చీకటి తెరలాయే
బ్రతుకులు చిరినబొంతలాయే కళ్ళకుగంతలాయే
పచ్చదనం ఒక పగటికలగా మిగిలిపోయే
దుమ్ము కమ్ముకున్న దర్పణంలో బొమ్మలాయే
ప్రక్షాళన కొరవడి ప్రవహించే గంగానదులాయే
పాలనాపగ్గాలు చేపట్టిన నేతలకు
కడుపునిండిన కార్పొరేటర్లే తప్ప
దేశప్రగతికి పునాది రాళ్ళైన కార్మికులు కర్షకులు
కార్చేకన్నీటి ధారలు కళ్ళకు కనిపించవాయే
నిరుద్యోగుల వేడినిట్టూర్పులు
అన్నదాతల ఆకలి కేకలు
ఆక్రందనలు చెవులకు వినిపించవాయే
విమానాల్లో విదేశాల్లో విహరించే వీరికీ
ఆందోళన చేసే కర్షకుల గుడారాల వైపు అడుగులు
పడవాయే ఆదుకొవాలన్న ఆలోచనే రాదాయే
ఈ దుస్థితి ఈ దుర్మార్గం తక్షణం మారాలి
ప్రజల శ్రేయస్సు సంక్షేమంపై దృష్టి సారించాలి
ప్రభుత్వం పంతాలకు పట్టింపులకు పోరాదు
పొరుగు దేశాల దృష్టిలో చులకన కారాదు
చివరికి చిలికిచిలికి గాలివానగా మారరాదు
సమస్యల సుడిగుండంలో దేశం చిక్కుకోరాదు
దేశభధ్రతకు ముప్పు వాటిల్లరాదు
సైనికుల్లాంటి రైతుబిడ్డల మనోస్థైర్యం దెబ్బతినరాదు
పాలకులు మొద్దునిద్దుర నుండి వెంటనే మేల్కోవాలి
సుహృద్భావ వాతావరణంలో ఉద్యమనేతలతో తక్షణమే
శాంతియుత చర్చలు జరపాలి సమస్యలు పరిష్కరించాలి



