మనుషులందరు
ఆ విధిచేతిలో
కీలు బొమ్మలే
అమాయకపు
ఆడవాళ్లు కొందరు
మానవత్వంలేని
శాడిస్టులైన మొండి
మొగుళ్ళచేతిలో ఆటబొమ్మలే
ఓ మహిళా మేలుకో
నీ మెడలోని తాళిబొట్టు
విలువ తెలుసుకో
అది నీకు ఉరితాడు
కాకుండా చూసుకో
కానరాని అనుబంధాల
సంకెళ్ళకు బంధీవైపోకు
కట్టుకున్నవాడు
తాళి కట్టినవాడు
కఠినాత్ముడైతే
కసాయివాడైతే
కామాంధుడైతే
సహనంతో ఓర్పుతో
భూమాతలా సర్దుకుపోకు
పులిలా ఎదురుతిరుగు
నీవు అబలవు కాదు
సబలవని మరువకు
కనురెప్పలే
కంటిపాపను కాటేస్తే
కాపలాదారులే
ఇంటిని దోచేస్తే
కంచే చేను మేస్తే
నీలో సగమైన వాడే
నిన్ను చిత్రహింసలకు
గురి చేస్తుంటే
ఇంకెంత కాలం
భయపడతావు ?
ఇంకెంత కాలం
బాధపడతావు ?
ఇంకెంత కాలం
భరిస్తావు ఈ మనోవేదన
మౌనంగా ఈ మానసిక క్షోభ ?
గుండెకు గాయమైతె
మనసు కుమిలిపోతది
శరీరానికి గాయమైతే
కళ్ళళ్ళో కన్నీటిధారలే
కానీ నీకు కష్టమొస్తే
ఆదుకునే వారే లేరే
ఎవరో వస్తారని ఏదో
చేస్తారని ఇంకెంత కాలం
ఎదురు చూస్తావు వెర్రిదానిలా?
ఇకనైనా మారు
కామాంధులకు
కలలో కాళికవై
కంటిలో కారమై
గుండెలో గునపమై
ప్రక్కలో బల్లెమై
కాలిలో ముళ్ళువై
చెవిలో జోరీగవై
నీ ఆత్మస్థైర్యమే
నీకు ఆయుధమై
నీకు నీవే రక్షణకవచమై
నీవు బలహీనమైన ఒక
వ్యక్తివి కాదని ఆదిపరాశక్తివని
తెలుసుకో...భయపడకు
నివురు గప్పిన నిప్పులా వుండు
ఆరని అగ్నిజ్వాలవై భగ్గునమండు



