Facebook Twitter
నేనే నీ "అమ్మను" నిన్నెవరికీ "అమ్మను" 

జన్మనిచ్చిన అమ్మకన్నా ప్రాణంపోసిన

బ్రహ్మకన్నా మిన్న ఎవరు ఈ లోకాన ? కానీ

కొందరు తల్లులు విధిచేతిలో కీలుబొమ్మలు

కొందరు గారడీవాని చేతిలో తోలుబొమ్మలు

 

ఓ అమ్మా ! నీవు నన్ను

నవమాసాలు మోసినందుకు

నీగర్భంలో నన్ను దాచుకున్నందుకు

ప్రసవవేదన భరించి నన్ను కన్నందుకు నీకు

వందనం ! అభినందనం ! పాదాభివందనం !

 

ఓ అమ్మా ! నీవే నా కన్నతల్లివి కల్పవల్లివి

చల్లని జాబిల్లివి నీ హృదయం నవనీతం నిజమే

అమ్మపాలే శ్రేష్టమంటారు

అందరూ అదీ సత్యమే

కానీ అమ్మా ఆకలంటూ నేేే కేకలేస్తే జోలపాట పాడి

జోకొట్టి బక్కచిక్కిన నాకు డబ్బాపాలుపట్టావు

బలిసిన పక్కింటి బాబుకు నీచనుబాలనిచ్చావు    

అమ్మా నీవు మారిపోయావు పినతల్లిలా పిచ్చిదానిలా 

ఇది కన్నతల్లి ప్రేమా కాదే? ఖచ్చితంగా ఇది కల్తీప్రేమయే ?

అమ్మా నీకేదో కరోనాను మించిన "ప్రైవేటు వైరస్" సోకింది

రక్తసంబంధాలు మరిస్తే రాలిపోవడం ఖాయం కాస్త జాగ్రత్త! 

 

ఇంతకీ ఓ అమ్మా ! నేనెవర్నీ అనేగా మీ ధర్మసందేహం !

ఔనమ్మా నేను గతజన్మలో

"విశాఖఉక్కు ఆంధ్రులహక్కు"అని దిక్కులు పిక్కటిల్లేలా

నినదించి ఉక్కుసంకల్పంతో ఉద్యమాలు చేసి

హక్కులన్నీ కాలరాసేస్తే ఆమరణ నిరాహారదీక్షలు చేసి 

సమిష్టిగా పోరాడి ఉక్కు ఫ్యాక్టరీని సాధించుకొని

కొండంత తృప్తితో కన్నుమూసిన "కార్మిక బిడ్డనమ్మా" !

ఔనా బిడ్డా ! ఐతే నా పాలు నీకే త్రాగు తృప్తిగా త్రాగు

నేనే నీ "అమ్మను"నిన్నెవరికీ "అమ్మను" నామాట నమ్ము

అమ్మా ! పుట్టకుండానే తిట్టినందుకు...నన్ను క్షమించమ్మా

 

ఆ మాటలకా తల్లి మంచుముక్కలా...గంధపుచెక్కలా

కరిగిపోయింది ఆ బిడ్డను ఎత్తుకుంది

గ...ట్టి...గా హృదయానికి హత్తుకుంది

ముద్దుల్లో ముంచెత్తింది మురిసిపోయింది...అంతే...

భళ్ళున తెల్లవారింది... కళ్ళు తెరిచి చూసింది

ఓ "కమ్మనికల" కరిగిపోయింది

ఆ గర్భిణీ స్త్రీ కాసేపు కలవరపడిపోయింది

కడుపులో కదిలే ఆ"కార్మికబిడ్డ"ను తలచుకుంటూ 

ఔను "ఈకల నిజమైతే" ఎంత బావుండనుకుంటూ

విశాఖ ఉక్కు ఉద్యమంలో "విజయఢంకా" 

మ్రోగినంతగా సంబరపడిపోయింది