Facebook Twitter
ఏరువాక....

ఏరువాకంటే...

నాగలితో దుక్కిదున్నేరోజు

పొలం పనులకు శ్రీకారం చుట్టేరోజు  

కాడెడ్లను నాగళ్ళను అందంగా 

అలంకరించి పూజించే పున్నమిరోజు 

 

ఏరువాకంటే...

ఎద్దుల కాళ్లను ముద్దాడేరోజు

కొమ్ములకు గలగలమనే గంటలు కట్టేరోజు   

హలం పుట్టి పొలం దున్నేరోజు

రైతన్నలు మట్టితో మాట్లాడే రోజు

పంటపొలాలను పలకరించేరోజు 

విత్తనాలను ఆశతో వెదజల్లే రోజు

నాగళ్ళు పకపకమని నవ్వే రోజు 

 

అంతులేని సంతోషం 

పొయ్యిమీద పాలలా పొంగిపొర్లగ

ఉల్లాసంగా ఉత్సాహంగా 

"నవధాన్యాలను గంపకెత్తుకొని

సద్దిఅన్నము మూటగట్టుకొని

ముళ్ళు గర్రను చేతపట్టుకొని 

ఇల్లాలిని‌‌ నీ వెంట బెట్టుకుని

ఏరువాక సాగారో రన్నో చిన్నన్న

నీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్న

అంటూ ఖుషీఖుషీగా కూనిరాగాలుతీస్తూ

రైతన్నలు దుక్కిదున్నేరోజే...ఏరువాక

 

వర్షాలు మెండుగా కురవాలని 

పచ్చని పంటలు పండాలని 

ఈఏడు ధాన్యలక్ష్మితో ధనలక్ష్మీతో

ఇళ్ళంతా ధగధగలాడిపోవాలని 

అందరి ఆకలి మంటలు ఆరాలని 

అన్నదాతచేసే "యజ్ఞమే"...ఏరువాక