Facebook Twitter
మన్మధుని మాయాజాలం ?

ప్రేమించే వయసు వచ్చిందా?
ప్రేమించే పిల్ల నచ్చిందా? 
అది నిజమైన ప్రేమా?
అర్థం లేని ఆకర్షణా ?
అది తొలి పరిచయమా ?
కళ్ళుపొరలు కమ్మిన కామమా?

ప్రేమించిన వాన్ని ఒక్కసారైనా 
చూడాలని కలసి మాట్లాడాలని
కమ్మని కలలు కనడమెందుకు ?

తలుపు దగ్గర వాడి పిలుపుకోసం
తహతహలాడి పోవడమెందుకు ?
తపించడం జపించడమెందుకు?

లేఖకోసమో ప్రియురాలి రాకకోసమో
ఒళ్ళంతా కళ్ళుచేసుకుని ‌వాడు
నిద్రమాని నిరీక్షించడమెందుకు ?

చదివే చదువు బుర్రకెక్కక పోవడం
తిన్న తిండి సహించకపోవడం
కాళ్లు చేతుల్లో చమటలు పట్టడం
ఊపిరాడక‌‌పోవడం ఇలా ఇద్దరు 
ఉక్కిరిబిక్కిరై పోవడమెందుకు?

ఏదో మత్తులో మాయలోఉండేవేళ
అహోరాత్రులు అష్టకష్టాలుపడి
కని, పెంచిన అమ్మానాన్నలసలు
గుర్తుకు రాకపోవడమేమిటి ?

అమ్మానాన్నల అక్కాచెల్లెళ్ల
అన్నాతమ్ముళ్ళ స్నేహితుల
శ్రేయోభిలాషుల బంధువుల
చెక్కెరలాంటి చక్కనిసలహాలు
చెవులకెక్కక పోవడమేమిటి ?

ఔను ప్రేమఊబిలో పీకల
వరకు కూరుకుపోవడమే
మదిలో మన్మధభాణాలు
గ్రుచ్చుకొని తీరనికోర్కెలతో
రగిలిపోవడమే ప్రేమంటే...!

అదే పిచ్చి ప్రేమంటే...!
అదే ప్రేమ మాయంటే...!
అదే లోతైన ప్రేమలోయంటే...!
అదే మన్మధుని మాయాజాలమంటే...!