వాడు మన్మధుడే నవమన్మధుడే
వాడు మాయగాడే
ముమ్మాటికీ మహామాయగాడే
వాడి ముందు కూర్చున్న
ఏ మగువకైనా మతి చెడిపోవలసిందే
వాడి, మాయలో పడి, పోవలసిందే
వాడి ఓరచూపులు వేడిని పుట్టిస్తాయి
వాడి మాయమాటలు మత్తెక్కిస్తాయి
వాడి చిరునవ్వులు చురకత్తుల్లా
ఎక్కడెక్కడో దిగిపోతాయి
క్షణంలోఎంతటి వారైనా
వాడి వశమై పోవలసిందే,ఐతే
వాడు అందమైన చంద్రుడేమీ కాదు
కాని కలిసిన వారిలో వాడు
కాక పుట్టించే కామాంధుడు
ఎన్ని కొమ్ములున్నా వాన్ని
పొడిచేందుకు పులిలా వచ్చిన
ఎంతటి ఆంబోతైనా
పిల్లిపిల్లలా మారిపోవలసిందే
వాడు వేణువు ఊదితే చాలు
ఉరిమి చూసే సత్యభామలందరు
గోపికలై వాడి చుట్టు గోవుల్లా
గిరగిరా తిరగవలసిందే
వాడు కరుడుగట్టిన కసాయివాడని
జిత్తులమారి నక్కని తెలిసినా
అమ్మాయిలందరూ వాడినే
గుడ్డిగా నమ్ముతారు
వాడిచుట్టే గుండ్రంగా తిరుగుతారు
వాడి వెంటే పిచ్చెక్కిపరుగులు తీస్తారు
అందుకే, వాడిలో ఏదో అర్దం కాని
ఎవరికీ అంతుచిక్కని, అతీతమైన
అతీంద్రియ శక్తి ఒకటేదోవున్నది
అది జన్మతోసహా వచ్చినట్లున్నది
వాడు రాతి గుండెల్ని కరిగించగలడు
ఆ గుండెల్లో గుబులు పుట్టించగలడు
వశపరుచుకోవడం వాడికి వరమే
కాని,వాడు విసిరిన వలలోపడి
పాపం గిలగిలా కొట్టుకోవడం
అమాయకులైన అమ్మాయిలకు పెద్దశాపమే



