ఓ దైవమా..!
ఈ పిచ్చి మనిషిని
సృష్టించింది నీవేనని
పవిత్ర గ్రంధాలన్నీ ఘోషిస్తున్నాయి
కానీ మనిషి పాపభీతి దైవభీతిలేక
ఇన్ని ఘోరాలు ఇన్ని నేరాలు
ఇన్ని పాపాలు చేస్తున్నా...
ఓ దైవమా..!
నీవెందుకు శపించక...
శిక్షించక...మౌనంగా ఉన్నావు..?
గుడిలోని ఓ దైవమా...?
నీవు కళ్ళులేని కబోధివా..?
కాదే మరెందుకు..?
సాటి మనిషిని
గాఢాంధకారంలో
ఎగిరే గబ్బిలాల కన్నా
వీధిలో తిరిగే కుక్కల కన్నా
నిర్దాక్షిణ్యంగా...నీచంగా చూసే
ఈ నీచుల...
ఈ నికృష్టుల...
ఈ కసాయివాళ్ళ...
కళ్ళను పీకేయక....
కాళ్లు చేతులు నరికేయక...
కాలగర్భంలో వారిని కలిపేయక...
ఓ దైవమా..!
ఎందుకు మౌనంగా ఉన్నావు..?
ఏం చేస్తున్నావు...ఎక్కడ దాగి ఉన్నావు..?
ఇక్కడ జరిగే ఈ అమానవీయ దుష్కృత్యాలు నీ దృష్టికి రాలేదా..?
నీ సృష్టికే మాయని మచ్చను తెచ్చే
ఈ మానవ మృగాలను మట్టుపెట్టలేవా..?
సభ్యసమాజాన్ని పట్టిపీడించే ఈ
రాక్షసమూకల్ని సమాధిలోకి నెట్టలేవా...?
ఎందుకు మౌనంగా ఉన్నావు..?
ఏం చేస్తున్నావు...ఎక్కడ దాగి ఉన్నావు..?
రగులుతోంది రగులుతోంది
ఓ వైపు కులాలకు కుంపటి..!
జరుగుతోంది జరుగుతోంది
ఓ వైపు మతాల మారణహోమం..!
ఆపేదెవరు..? వీటిని అంతం చేసేదెవరు..?
ఓ దైవమా..!
ఎందుకు మౌనంగా ఉన్నావు..?
ఏం చేస్తున్నావు...ఎక్కడ దాగి ఉన్నావు..?
ఇదే ఇదే మీ భక్తుల వేదన....ఆవేదన..!
అంతులేని ఆక్రందన...అరణ్య రోదన..!
దయగల ఓ దైవమా...దారి చూపుమా..!



