ఆది కావ్యమైన రామాయణాన్ని సంస్కృతంలో చెక్కుచెదరని సుందర
శిల్పంలా చెక్కిన ఆదికవి...కవికోకిల...
శ్లోకప్రక్రియ సృష్టికర్త "శ్రీవాల్మీకి మహర్షిని"
ఏమని వర్ణింతు..?నేనేమని వర్ణింతు..?
ఇరవై నాలుగు వేల శ్లోకాలతో
ఐదువందల ముప్పై ఏడు సర్గలతో
బాల...అయోధ్య...అరణ్య...కిష్కింధ...
సుందర...యుద్ద...ఉత్తరను
చెరకు గడల్లాంటి ఏడు కాండలతో
లిఖించిన శ్రీమద్రామాయణం...
ఒక మహా కల్పవృక్షం...
ఒక అమృత భాండం...
సకల మానవాళికి నీతి శతకమై
వెన్నెలవెలుగులు పంచే
సీతారాముల చరితం
నవనీతం నవరస భరితం
అట్టి "రామాయణ గ్రంథాన్ని"
ఏమని కీర్తింతు..? నేనేమని కీర్థింతు..?
అష్టాక్షరీ మంత్రం
ఓం నమో నా"రా"యణాయ"లోని
పంచాక్షరిమంత్రం
ఓం న"మ"శ్శివాయ"లోని
రెండు బీజాక్షరాలైన
శ్రీ "రామ"నామజపం...
సర్వలోక పాప...శాప..హరణం
అట్టి "రామనామ మహిమను"
ఏమని పొగిడెద..? నేనేమని పొగిడెద..?
ఏకపత్నీ వ్రతుడు
తండ్రి మాట జవదాటని
పితృవాక్య పరిపాలకుడు
పదహారు సుగుణాల పరంధాముడు
శ్రీ మహావిష్ణువు అవతారియైన
అందరికి ఆరాధ్య దైవమైన...
"కోరిన కోర్కెలు తీర్చే కోదండరామున్ని"
ఏమని శ్లాఘించెద?నేనేమని శ్లాఘించెద.?
నాడు అశోక వనంలో విలపించినా...
అయోధ్యలో అగ్ని ప్రవేశం చేసినా...
అవమాన భారంతో అడవులకేగినా...
చలించని సహనహశీలి...సాధ్వీమణి
"సీతమ్మ తల్లి"ఆరనితీరని కన్నీటిగాథల్ని
ఏమని వివరింతు.?నేనేమని వివరింతు..?
ఈ జగతిలో...చెక్కుచెదరక
సప్తసముద్రాలు ఎండి పోనంతకాలం...
సజీవనదులు ప్రవహిస్తున్నంతకాలం...
సూర్యచంద్రులు ప్రకాశిస్తున్నంతకాలం...
పర్వత శిఖరాలు నిలిచి ఉన్నంతకాలం...
భక్తులకు దర్శనమిచ్చేసుందర శిల్పాలు
ఈ "శ్రీ సీతారాముల దివ్య రూపాలు"
అట్టి "ఆ అపురూప దేవతామూర్తులను"
నిత్యం వేడుకొనక స్తుతించక స్మరించక
నేనెలా జీవింతును.?నేనెలా జీవింతును.?



