నా తొండంతో
కొండలను పిండి చేయగలను
పర్వతాలను పాతాళానికి అణగద్రొక్కగలను
ఎవరెస్టు శిఖరాన్ని సైతం
ఎత్తి సముద్రంలో విసిరి వేయగలను
ఈ భూమిపై నేనే బాహుబలినని
అహంకారంతో విర్రవీగే గజరాజుకు
పాపం ఓ రోజు...విషగడియ ప్రాప్తించే...
ఎర్రని ఎండకు
తాళలేక దాహమేసి
నీటి మడుగులో దిగి మొసలి
కోరల్లో చిక్కి గిలగిలాడిపోయే...
దిక్కులన్నీ పీక్కటిల్లేలా...
అడవి అంతా దద్దరిల్లేలా...
భూకంపమొచ్చినట్లుగా అరిచి గీపెట్టే...
లాభమేమీ లేకపోయె...
మొసలి చెర వీడకపోయె...
అహంకారం వీడిపోయె...
ఘీంకారం మరచిపోయె...
ఆపై ఓంకార నాదం చేసే
రక్షించమని శ్రీహరిని వేడుకొనే
పరుగు పరుగున శ్రీహరి వచ్చే...మొసలి కోరలు విరిచే...గజరాజును గట్టుకు చేర్చే...
ఔను దుష్టశిక్షణ శిష్టరక్షణ
చేసే సర్వశక్తిమంతుడైన
నీ సృష్టికర్తను మరవొద్దనె...భగవద్గీత....
తనను తాను తగ్గించుకున్నవాడే
హెచ్చింపబడుననే పవిత్ర గ్రంథం...బైబిల్
నేనే బలవంతున్నని...
నేనే భగవంతున్నని....
విర్రవీగొద్దు అహంకారమొద్దనే...ఖురాన్
అందుకే ఓ మనిషీ..!
నీ గుండెల్లో గుర్తుంచుకో..!
స్మరించుకో ప్రతినిత్యం ఈ జీవితసత్యం..!



