"కరుణలేని ఆ వరుణదేవుడు"
కుండపోతగా వర్షాలను కురిపించి
లక్షలాదిమంది నీ భక్తులకు
మౌనంగా "మరణశిక్ష" విధించాడు...
కారు చీకట్లో భయం గుప్పెట్లో
నీటిలో తేలియాడే శవాల మధ్య
బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు...
ఎందరో నరకయాతన అనుభవిస్తున్నారు
రక్షించ రావయ్య ఓ బొజ్జ గణపయ్య..!
కాపాడగ రావయ్యా ఓ కరుణామయ..!
వచ్చి...
వరదలో...
కష్టాల బురదలో...
పీకల్లోతు కూరుకుపోయి...
దిక్కుమొక్కు లేక దీనంగా...
సర్వం వరదనీటిలో "నిమజ్జనమై"
కట్టుబట్టలతో రోడ్లపై రోదిస్తున్నారు...
ఆకలికి పిల్లలు అలమటిస్తున్నారు...
"దుఃదాయిని" "బుడమేరు"
"ఉగ్రరూపం దాల్చి ఊళ్ళకు ఊళ్ళే
"జలప్రళయానికి" గురై
"జలదిగ్బంధంలో " చిక్కుకొని
"జలసమాధి" ఐపోతున్న...
"వలలో చిక్కిన చేపల్లా"
"విలవిలలాడిపోతున్న...
"దినదిన గుండంగా బ్రతుకుతున్న
"ఇటు విజయావాడ విధివంచితులను...
అటు "మున్నేరు" ముంచెత్తి
కన్నీరు మున్నీరుగా
విలపిస్తున్న ఖమ్మం వాసులను...
రక్షించ రావయ్యా ఓ బొజ్జ గణపయ్య..!
కాపాడగ రావయ్యా ఓ కరుణామయ...!



