ఎందుకు..? ఎందుకు..? ఎందుకు..?
కనీ వినీ ఎరుగని
కలనైనా ఊహించని
అతిభారీ వర్షపాతం నమోదై
వందేళ్ళలో రాని వరదలు
ఒక్కసారే
విరుచుకుపడుతున్నాయి..!
కట్టుబట్టలతో
రోడ్లమీద పడేస్తున్నాయి..!
ఊళ్ళకు ఊళ్ళనే
తెల్లారేసరికి ఊడ్చేస్తున్నాయి..!
ఎందుకు..? ఏమైంది..?
ఈ ప్రపంచానికి...ఈ ప్రజలకు...
ఎందుకు ప్రకృతి ఇంతగా
వికృతరూపం దాలుస్తుంది..?
ఎందుకు ఇంత
విధ్వంసం సృష్టిస్తుంది..?
ఎందుకింతగా
విలయతాండవం చేస్తుంది..?
ఎందుకు నరుని బ్రతుకు
భూమిపై నరకమౌతుంది..?
ఇది ఎవరి తప్పిదం..?
ఇది ఎవరు చేసిన పాపం..?
ఇది ఏ దుష్ట శక్తుల శాపం..?
ఎంతకూ అర్థంకాకున్నది...
కన్నెర్ర చేసే...ఓ కాలమా..!
కాస్త జవాబు చెప్పుమా...!
మా సందేహాలు తీర్చుమా..!



