Facebook Twitter
నరుని బ్రతుకు నరకం...ఎందుకు...?

ఒకవైపు కుక్కలు
ఒకవైపు నక్కలు
దారుణంగా
దాడి చేస్తున్నాయి..!

ఒకవైపు కోపంతో
కొండచరియలు
విరిగి పడుతున్నాయి..!

ఒకవైపు
విలయం
విధ్వంసం
విపత్తు
విషాదం...!
మరోవైపు
కుండపోతగా
వర్షాలు కురిసి
వాగులు వంకలు
ఉప్పొంగి వరద భీభత్సం
జనజీవనం అతలాకుతలం..!

ఒకవైపు
ఆలేరు
కొల్లేరు
మున్నేరు
బుడమేరు
వాగులు
ముంచెత్తి
ప్రజలు కన్నీరు
మున్నీరుగా విలపిస్తున్నారు..!

ఒకవైపు...
కనీ వినీ ఎరుగని
కలనైనా ఊహించని
అతిభారీ వర్షపాతం నమోదై
వందేళ్ళలో రాని వరదలు
ఒక్కసారే విరుచుకుపడుతున్నాయి..!
ఊళ్ళకు ఊళ్ళనే
తెల్లవారేసరికి ఊడ్చేస్తున్నాయి..!
కట్టుబట్టలతో రోడ్లమీద పడేస్తున్నాయి..!

ఎందుకు..? ఏమైంది..?
ప్రపంచానికి... ప్రజలకు...
ఎందుకు ప్రకృతి ఇంతగా
వికృతరూపం దాలుస్తుంది..?
ఇంత విధ్వంసం సృష్టిస్తుంది..?
ఎందుకింతగా
విలయతాండవం చేస్తుంది..?
ఎందుకు నరుని బ్రతుకు
భూమిపై నరకమౌతుంది..?

ఇది ఎవరి తప్పిదం..?
ఇది ఎవరు చేసిన పాపం..?
ఇది దుష్ట శక్తుల శాపం..?
ఎంతకూ అర్థంకాకున్నది...
కన్నెర్ర చేసే... కాలమా..!
కాస్త జవాబు చెప్పుమా...!
మా సందేహాలు తీర్చుమా..!

మానవా పకృతిని ప్రేమించండి...!
పర్యావరణాన్ని పరిరక్షించండి..!
కావాలిదే మీ నిత్యజీవిత నినాదం..!