ప్రపంచానికి
మన భారతదేశం
అందించే
అద్భుతమైన...
అపురూపమైన...
అద్వితీయమైన...కానుక
ఆధ్యాత్మిక జ్ఞాననిధియే...!
అభ్యుదయ భావాల సంపదయే..!
కానీ ఈ
ఆధునిక
ఆధ్యాత్మిక
అరుణోదయ
అభ్యుదయ భావాలు...
కళ్ళకు కనిపించక...
చెవులకు వినిపించక...
తెల్లవారుజామున
మెల్లమెల్లగా
నేలకు జాలువారు
మంచు బిందువులవోలె
విశ్వమంతా వ్యాప్తిస్తాయి
మనసులో
శాంతి మంత్రాలై జనిస్తాయి
గుండెల్లో
గులాబీలై పరిమళిస్తాయి
ఓంకార నాదాలై
నలుదిక్కుల ప్రతిధ్వనిస్తాయి
ఔను సంఘంలో సమానత్వం
ఒక్క విద్య ద్వారానే సాధ్యమని...
అసమానతలు అణచివేతలు...
అంటరానితనముండరాదని...
అందరూ భరతమాత బిడ్డలేనని...
స్వేచ్ఛ స్వాతంత్ర్యం సమానత్వం
సౌభ్రాతృత్వంతో అందరూ అన్నాదమ్ముల్లా కలిసి మెలిసి
ప్రశాంతంగా జీవించాలన్న
అభ్యుదయ భావాలనందించిన వారు
మహామేధావి బహు గ్రంధకర్త
బహుముఖ ప్రజ్ఞాశాలి ఉద్యమకారుడు
దళితులపాలిట దైవం రాజ్యాంగ నిర్మాత
సూటు బూటుతో చూపుడు వేలుతో
వీధి వీధిలో విగ్రహమై విలసిల్లే
అమరజీవి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్..!
భగవంతునిపై నమ్మకం లేని
వారు కాదు నాస్తికులు...తమపై
తమకు నమ్మకం లేనివారే నాస్తికులన్న
ఆధ్యాత్మిక భావాలనందించిన వారు
అందమైన తలపాగాతో...
సుందరమైన కాషాయ వస్త్రాలతో...
కోటి ప్రచండ ప్రభలతో
నేటికీ...దివ్య స్వరూపుడై...
జ్ఞాన సూర్యుడై ప్రకాశించే...
విశ్వగురువు స్వామి వివేకానంద...!



