Facebook Twitter
వచ్చింది వచ్చింది స్వాతంత్ర్యం..?

మూగ గొంతులతో కాదు..‌.
మువ్వన్నెలజెండా చేబూని
అహింసామూర్తి జాతిపిత బాపూజీ
సారధ్యంలో వందేమాతరమంటూ
"క్విట్ ఇండియా" అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించిన నిప్పులు
కురిపించిన గళాలతోనే...వచ్చింది...
నా భరతజాతికి అర్థరాత్రి స్వాతంత్ర్యం..!

పిరికి పిడికిళ్లతో కాదు...
బిగించిన ఉక్కు పిడికిళ్ళతో
మృత్యువును ముద్దాడేందుకు
సిద్ధమైన విప్లవ వీర కిషోరాలతో
స్వాతంత్ర్య సమర యోధులతో
ఎందరో జాతినేతల దేశభక్తుల
ప్రాణత్యాగాలతోనే...వచ్చింది...
నా భరతజాతికి అర్థరాత్రి స్వాతంత్ర్యం..!

పిరికి పందలతో కాదు...
ఎందరో విప్లవవీరులు
గర్జించే కొదమసింహాలై
గండ్రగొడ్డళ్ళు చేపడితేనే...
అదరక బెదరక ఎదురిస్తేనే...
తెల్లవారి గుండేల్లో నిదురిస్తేనే...
తెల్లదొరల తలలు తెగనరికితేనే వచ్చింది
నా భరతజాతికి అర్థరాత్రి స్వాతంత్ర్యం..!

స్వార్థపరులతో కాదు...
బానిసత్వంలో బంధించి
మానవ హక్కులను కాలరాసే
చిత్రహింసలకు గురిచేసే
తెల్లకుక్కల భరతం పట్టిన
భయమన్నది ఎరుగని
మన భరతమాత ముద్దుబిడ్డలు
భగభగమండే భాస్కరులై
ఖణఖణమండే నిప్పుకణికలైన
భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవ్ లు
అతిపిన్న వయసులో అసువులుబాస్తేనే...
వచ్చింది వచ్చింది...
నా భరతజాతికి అర్థరాత్రి స్వాతంత్ర్యం...!