Facebook Twitter
వెన్న దొంగను‌‌ వేడుకుందాం…

శ్రావణమాసంలో...
శుక్లపక్షంలో...
రోహిణీ నక్షత్రంలో...
కంసుని చెరసాలలో...
బహుళ అష్టమినాడు...

నడిరేయిలో దేవకీ
వసుదేవుల గర్భాన
శ్రీ మహావిష్ణువు
ఎనిమిదవ అవతారంగా
జన్మించి యశోద
ఒడిలో పెరిగిన శ్రీకృష్ణుడు

ద్వాపరయుగంలో
"యాదవుల కులదైవమే"
కానీ ఈ కలియుగంలో
ప్రతిభారతీయునికి
కాదు కాదు సకల
మానవాళికి "ఇష్టదైవమే"

ఈ కృష్ణాష్టమి
పర్వదినాన ఉదయాన్నే
శ్రీ కృష్ణుడి విగ్రహాన్ని
గంగాజలంతో స్నానం చేయించి
పంచామృతంతో అభిషేకించి వెన్నపంచదార నైవేద్యంపెట్టి
తెల్లనివస్త్రాలతో బంగారు
ఆభరణాలతో అలంకరించి
మాయలు‌ చేసే కన్నయ్యని
మమతల‌
ఊయలలో వేసి ఊపి ఊపి...
జోజో ముకుందాయని
జోలపాటలు పాడి‌ పాడి...
దాండియా నృత్యాలు
ఆడిఆడి ఉట్టిని కొట్టి కొట్టి...

ఓం దేవకీ నందాయ...
విద్యయే వాసుదేవాయ...
ధీమహి తన్నో కృష్ణ ప్రచోదయాత్...అంటూ
హరే కృష్ణ ! హరే కృష్ణ...
కృష్ణ కృష్ణ ! హరే హరే....
హరే రామ ! హరే రామ...
రామ రామ ! హరేహరే...అంటూ
శ్రీకృష్ణ మంత్రాలు జపించి జపించి...
భక్తితో‌ గీతాపారాయణం చేసి చేసి...
ప్రార్థించి ప్రార్థించి అలసిపోయి
అడుగుదాం...అడుగుదాం
ఆ అల్లరికృష్ణున్ని అడుగుదాం...
వేడుకుందాం...వేడుకుందాం...
ఆ వెన్న దొంగను‌‌ వేడుకుందాం...
మన కష్టాలను దొంగిలించమని...
వీనుల విందుగా
వేణుగానం వినిపించమని...
మన జీవితాల్లో వెన్నెల కురిపించిమని...

మదిమదిలో ఇంత శాంతిని
ప్రశాంతతను కుమ్మరించమని...
చీకటి జీవితాలను
వెలిగించే గీతాసందేశమివ్వమని ...
నాడు ద్రౌపది మానాన్ని
కాపాడిన చందాన
కొవ్వెక్కిన కళ్ళుపొరలు కమ్మిన
కామాంధులను కాటికి పంపమని...
దుష్టశిక్షణ శిష్టరక్షణకై
సుదర్శనచక్రాన్ని సిద్ధంచేసుకోమని...
అడుగుదాం...అడుగుదాం
ఆ అల్లరికృష్ణున్ని అడుగుదాం...
వేడుకుందాం...వేడుకుందాం...
ఆ వెన్న దొంగను‌‌ వేడుకుందాం...