నేడు 78 వ స్వాతంత్ర్య దినోత్సవం
భారతీయులందరికీ విముక్తి పండగ..!
ఈ 78 ఏళ్ల సుధీర్ఘ ప్రస్థానంలో
ఎన్ని కన్నీటి గాథలో...ఎన్ని ఎత్తుపల్లాలో
ఎన్ని నిచ్చెనలో...ఎన్ని పాము కాట్లో...
ఎన్ని హృదయవిదారక దుస్సంఘటనలో
1...
ఔను ఎందుకు..? ఎందుకు..?
నిన్న ముసిముసి నవ్వులు నవ్విన
నా మువ్వన్నెల జెండా...నేడు
మౌనంగా ఉన్నది రెపరెపలాడకున్నది...
రెక్కలు విరిగిన పక్షిలా దిగులుగా ఉన్నది
కారణం ఒక్కటే...
నిన్న పారిస్ ఒలింపిక్స్ లో
ఫైనల్ కు చేరిన భారతీయ రెజ్లర్
వినేశ ఫొగాటె అనర్హతకు గురై
అడుగు దూరంలో బంగా...రు
పతకం చేజా...రిపోయినందుకు...
140 కోట్ల మంది భారతీయులు
కన్న కలలన్నీ కన్నీరైనందుకు...
ఆశలన్నీ అడియాశలైనందుకు...
ఎక్కడ ఎక్కడ లోపాలెక్కడ..?
ఎక్కడ ఎక్కడ గుణపాఠాలెక్కడ..?
2...
ఎందుకు...? ఎందుకు..?
నిన్న కిలకిల నవ్విన
నా కన్నతల్లి భరతమాత
నేడు కన్నీరు మున్నీరౌతున్నది..?
గుర్తు చేసుకుంటూ...ఏదో ఏదో
గుండెలు బాదుకుంటున్నది..?
కారణం ఒక్కటే...
నిన్న తన కళ్ళముందే
మతఘర్షణలు చెలరేగి
మణిపూర్ మంటల్లో మానవత్వం
కాలి బుడిదై పోయినందుకు...ఇంకా
రావణకాష్టంలా రగులుతున్నందుకు...
పట్టపగలే నడిరోడ్డుపై మహిళల్ని
అర్థనగ్నంగా ఊరేగిస్తున్నందుకు...
ఎక్కడ ఎక్కడ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలెక్కడ
3...
ఎందుకు..? ఎందుకు..?
నిన్న ముసిముసి నవ్వులు నవ్విన
నా మువ్వన్నెల జెండా... నేడు
మౌనంగా ఉన్నది రెపరెపలాడకున్నది..?
రెక్కలు విరిగిన పక్షిలా దిగులుగా ఉన్నది
కారణం ఒక్కటే...
నిప్పులాంటి ప్రజాస్వామ్యానికి
ముప్పు వాటిల్లినందుకు..!
పాలకుల ప్రణాళికలే పాలకుండలో
విషపు చుక్కలైనందుకు...
రక్షణ కవచం లాంటి రాజ్యాంగానికే
రక్షణ లేకుండా పోయినందుకు...
ఎక్కడ ఎక్కడ ప్రజా రాజ్యమెక్కడ..?
ఎక్కడ ఎక్కడ ప్రజా సంక్షేమమెక్కడ..?
4...
ఎందుకు...? ఎందుకు..?
నిన్న కిలకిల నవ్విన
నా కన్నతల్లి భరతమాత
నేడు కన్నీరు మున్నీరౌతున్నది..?
గుర్తు చేసుకుంటూ...ఏదో ఏదో
గుండెలు బాదుకుంటున్నది..?
కారణం ఒక్కటే...
మొన్న కేరళలో అతి సుందరమైన
వయనాడ్ జిల్లాలో ప్రకృతి ప్రళయం
విలయతాండవం చేసినందుకు...
కొండచరియలు కొండచిలువలై
విరుచుకు పడినందుకు...
వందలాదిమంది వరదలో
కొట్టుకు పోయినందుకు...
బురదలో కూరుకుపోయిందుకు...
అర్థరాత్రిలో నిద్రలోనే వేలాది మంది జలసమాధియై పోయినందుకు....
ఎక్కడ ఎక్కడ పర్యావరణ పరిరక్షణే ఎక్కడ?
ఎక్కడ ఎక్కడ ప్రభుత్వ పాలకుల
ముందస్తు హెచ్చరికలు...ఎక్కడ..?
5...
ఎందుకు...? ఎందుకు..?
నిన్న కిలకిల నవ్విన
నా కన్నతల్లి భరతమాత
నేడు కన్నీరు మున్నీరౌతున్నది..?
గుర్తు చేసుకుంటూ...ఏదో ఏదో
గుండెలు బాదుకుంటున్నది..?
కారణం ఒక్కటే...
కలకత్తాలో
కామాంధుడొకడు
కళ్ళు పొరలు కమ్మి...
మానవమృగంగా మారి
మానసికంగా....శారీరకంగా హింసించి...
అత్యాచారం చేసి ఆపై ట్రైనీ డాక్టర్ ను
నిర్ధాక్షణ్యంగా పొట్టన పెట్టుకున్నందుకు...
ఎక్కడ ఎక్కడ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలెక్కడ
నిజానికి స్వాతంత్ర్యం అంటే..?
సమానత్వం...సౌభ్రాతృత్వమే...
స్వేచ్ఛా వాయువులను పీల్చడమే.!
స్వాతంత్ర్యం అంటే..? ప్రజాస్వామ్యమే
ఆ ప్రజాస్వామ్యంలోనే ప్రజలకు దక్కు
ప్రాధమిక హక్కులే...రాజ్యాంగ రక్షణలే..!
ఔను ఎందరో విప్లవ వీరుల
స్వాతంత్ర్య సమర యోధుల
త్యాగాల ఫలితమైన
మనస్వాతంత్ర్య ఫలాలు
అందరికీ అందాలని...
మన భారతావనిలో ప్రజాస్వామ్యం
పరిఢవిల్లాని కోరుకుందాం..!
ఆ మహనీయులను స్మరించుకుందాం..!
వారి ఆశయాలకు అంకితమౌదాం..!
జైహింద్...జై భారత్...జైజై భారత్...



