Facebook Twitter
పాదధూళి... మృత్యుకేళి...

నీలాగ నాలాగ పుట్టినోడు
భగవంతుడెట్లా ఔతాడు..?
వాడు మీలాంటి
సామాన్యమైన వ్యక్తి...
వాడిలో ఎక్కుడిది
మానవాతీత శక్తి..?

వాడి ఇంటిలో వేసిన బోరు
నీళ్ళు త్రాగితే మీ జబ్బులెలా నయమౌతాయి..? వాడి
పాదధూళి అంత పవిత్రమైనదా.?

వాడు ఊరేగే పూలరధానికి
కట్టిన పూలమాలల్లో...
వాడి కాలికింది మట్టిలో
అన్ని మహిమలుంటాయా..?

ఆ మట్టి సేకరణకు
ఇంతగా ‍ఎగబడడమా..?
తోపులాటలోతొక్కిసలాటలో
ఊపిరాడక ఇంతమంది
దుర్మరణం చెందడమా..?
ఇన్ని కుటుంబాలు
చిన్నా భిన్నమైపోవడమా...
చితికి ఛిధ్రమైపోవడమా....

ఏమిటీ అజ్ఞానం..?
ఏమిటీ మూఢనమ్మకం..?
మతం మత్తుమందని...
అతిభక్తి అనర్థమని...
ఎప్పటికి అర్థమయ్యేను
ఈ అమాయకపు జనానికి...?

ఈ స్థాయిలో "మత పిచ్చి" ముదిరితే..?
వరాలవలలు భక్తిబాణాలు విసరడానికి
బలహీనతలను సొమ్ము చేసుకోవడానికి
వేయిమంది వేటగాళ్లు సిద్ధం కారా..?
కొంపలు ముంచేందుకు...కోటిమంది దొంగబాబాలు...కొత్తగా పుట్టుకురారా..?