Facebook Twitter
వికసితభారత్

మతంచిచ్చు రగిలించే
ఓ మతోన్మాదులారా !
రక్తపాతం సృష్టించే
ఓ రాజకీయ నాయకులారా !!

                                 

అదిగో అటు చూడండి
కన్నతల్లి భరతమాత
కలవర పడుతున్నది
కన్నీరు పెడుతున్నది.... ఎందుకు ?
మతం పేరుతో దారుణ మారణ

హెూమాలు సృష్టిస్తున్నందుకు...

నిన్న మతం
ఒక మత్తుమందు
నేడు ఆ పేరు
ఎత్తితేనే రక్తం చిందు
నిన్న మతమన్నది
మంచికి మానవత్వానికి
ఒక చిహ్నం కాని నేడది
భగ్గుమంటున్న ఓ అగ్నిగుండం...

మతంచిచ్చు రగిలించే
ఓ మతోన్మాదులారా !
రక్తపాతాలు సృష్టించే
ఓ రాజకీయ నాయకులారా !!
మన మతగ్రంధాలు
మనకు ఏమని బోధిస్తున్నాయి
సర్వమతాల సారం ఒక్కటని
మానవసేవయే మాధవ సేవయని కదా !

మన మహాపురుషులు
మనకు ఏమని ఉద్భోధిస్తున్నారు
పోరునష్టం పొందులాభమని...
కలసివుంటేనే కలదు సుఖమని కదా !
మరేమిటీ మత విద్వేషాలు విధ్వంసాలు

నిజానికి...
ఎవరు హిందువు ? ఎవరు ముస్లిం ?

ఎవరు క్రిస్టియన్ ? ఎవరు సిక్కు ?

స్వేచ్ఛగా బ్రతకడం ఈ సృష్టిలో
కాదా ! ప్రతి వ్యక్తి జన్మహక్కు...?

అందుకే...
మతంచిచ్చు రగిలించి
మానసికానందం పొందే
ఓ మతోన్మాదులారా !
కుట్రలతో కులరాజకీయాలతో
అధికార పీఠాన్ని అధిరోహించే
ఓ రాజకీయ నాయకులారా !

అధికార దాహం మాని
ఇకనైనా ఆలోచించండి మన దేశం
మరుభూమిగా మారకమునుపె
మతం రక్కసిని మట్టుబెట్టండి
ఈ అఖండ భారతావనిలో ఇంకా
సెక్యులరిజం చెక్కుచెదరలేదని...
ప్రజాస్వామ్యం ముక్కలు కాలేదని...
ప్రపంచానికి చాటి చెప్పండి.

ఓం శ్శాంతి శ్శాంతిః అంటూ
జగమంతా ప్రతిధ్వనించేలా
జన్మంతా జపించండి.
కళ్ళుతెరచి చూడండి...
రండి..! రండి..?
కలసిరండి ! కదలిరండి !
కన్నతల్లి భరతమాత
కన్నీరును తుడవండి..!

జైహింద్... జయహో...
జయహో వికసిత భారత్...జయహో..