సృష్టి ధర్మం
తప్పించుకొనే దారి వెతుకుతూ భయంభయంగా
బెదురు చూపులు చూసే జింక పిరికిదే కావచ్చు
కాని, ప్రమాదాన్ని ముందే పసిగట్టి
పొదల మాటున పొంచివున్న శత్రువును కనిపెట్టి
అది, వేగంగా అతివేగంగా
ప్రాణభయంతో పరుగులు పెడుతున్నప్పుడు
ఆకలిగొన్న పెద్దపులిని సైతం అటూ ఇటూ
తిప్పి ముప్పుతిప్పలు పెడుతున్నప్పుడు
రాళ్ళురప్పలమీద ముండ్లతుప్పలమీద
చెంగుచెంగున దూకి తప్పించుకుంటున్నపుడు
ఎవ్వరి సహాయాన్ని ఆశించకుండా
కాపాడమని ఆ దైవాన్ని కూడా అర్దించకుండా
శక్తికి మించి శ్రమిస్తున్నప్పుడు
అది ఎంత తెలివి గలదో తెలుస్తుంది
అసలు ఆకలేసి ఆహారం కోసం
అడవిలో తిరిగే అమాయకపు జింకలు
ప్రమాదాన్ని పసిగట్టలేక కౄరమృగాలకు
ఆహారమైపోవడం వాటి ఆకలి తీర్చడం వీటి ఖర్మం
ఎవరికీ, ఎంతకూ అర్థం కానిది ఈ సృష్టి ధర్మం



