ఓ దైవమా ! తెలుసు...మాకు
మీరు సర్వాంతర్యామియని...
మేము గర్భగుడిలో ప్రతిష్టించిన
ఆ విగ్రహంలోనే మీరుండరని...
అది మా ఏకాగ్రత కోసమేనని...
ఓ దైవమా ! తెలుసు...మాకు
నారు నీరు పోసి సృష్టిలోని
జీవులను పెంచి పోషించేది మీరేనని...
ఓ దైవమా ! తెలుసు...మాకు
ఎదిగే మొక్కలకు అందమైన
రమణీయమైన రంగురంగుల
గూభాళించే పూలనిచ్చేది మీరేనని...
ఓ దైవమా ! తెలుసు...మాకు
ఎందరికో చల్లని నీడనిచ్చే పచ్చనివృక్షాలకు
కడుపునింపే కమ్మని ఫలాలనిచ్చేది మీరేనని...
ఓ దైవమా ! తెలుసు...మాకు
పండిన ప్రతి పంట కోతకొస్తుందని...
పండిన ప్రతి పండు
ఎండిన ప్రతి ఆకు నేలరాలుతుందని...
పెరిగిన ప్రతి మొక్క విరుగుతుందని...
మోడువారిన ప్రతి చెట్టు చిగురిస్తుందని...
పుట్టిన ప్రతి జీవి మట్టిలో కలిసిపోతుందని...
ఈ జనన మరణాలకు...
ఈ వసంత గ్రీష్మ ఋతువులకు...
ఈ కాలచక్రభ్రమణాలకు కారణం మీరేనని...
కానీ తెలియనిది ఒక్కటే
ప్రతి నరుడు నారాయణుడేనని...మీరు
ప్రతి అంతరాత్మను అయస్కాంతంలా ఆకర్షిస్తారని...
ప్రతి అంతరాత్మలో వెలిగే అఖండ జ్యోతి మీరేనని...



