Facebook Twitter
నమ్మవేమి ఓ నరుడా?

కళ్ళకు కనిపించవు గనుక
వేర్లు లేవంటూ వాదించే ఓ నరుడా !
కళ్ళముందే పచ్చగా పెరిగి
నీకు నీడనిచ్చే నీ కడుపును నింపే
చెట్టున్నది నిజమంటే నమ్మేటి ఓ నరుడా !
వేరులేక చెట్టుఉండునా అంటే...
నమ్మవేమి ఓ నరుడా?

కళ్ళకు కనిపించడు గనుక
యజమాని లేడంటూ వాదించే ఓ నరుడా !
నేడు నీవు ప్రశాంతంగా నివసించే
ఈ గృహమన్నది నిజమంటే నమ్మేటి ఓ నరుడా!
నిప్పులేక పొగవుండునా అంటే...
నమ్మవేమి ఓ నరుడా?

పగలు కళ్ళకు కనిపించవు గనుక
నింగిలో నక్షత్రాలు లేవంటూ వాదించే ఓ నరుడా !
సూర్యుడు అస్తమించగానె తారలెన్నో
తళుక్కున మెరుస్తాయంటే నమ్మేటి ఓ నరుడా !
కలకాదు అది పచ్చినిజమంటే...నమ్మవేమి ఓ నరుడా?

కళ్ళకు కనిపించదు గనుక
చల్లనిగాలి లేదంటూ వాదించే ఓ నరుడా !
ఉచ్ఛ్వాస నిచ్వాసాలే
మనిషికి ఊపిరంటే నమ్మేటి ఓ నరుడా!
ఆ ఊపిరి ఆగిన మరుక్షణం
మనిషికి మరణం తథ్యమంటే...నమ్మవేమి ఓ నరుడా?

కళ్ళకు కనిపించరు గనుక
నీ తాతముత్తాతలు లేరంటూ వాదించే ఓ నరుడా !
నీకు జన్మనిచ్చిన నీ అమ్మానాన్నలు
ఉన్నారన్నది నిజమంటూ నమ్మేటి ఓ నరుడా!
వారిని కన్న నీ తాతముత్తాతలు
ఉన్నారన్నది పచ్చినిజమంటే...నమ్మవేమి ఓ నరుడా?

అందుకే తెలుసుకో ఓ నరుడా !‌ తెలుసుకో
ఎవ్వరూ కాదనలేని ఓ పచ్చినిజం ! తెలుసుకో
మెరిసేదంతా...బంగారం కాదని...
ఈ మనిషి నేత్రాలకు
కనిపించేదంతా... నిజం కాదని...
కనపడనిదంతా...అబద్దం కాదని...

అది ఓ జ్ఞాననేత్రానికే....
అన్వేషించే ఓ అంతరాత్మకే...
తెలిసిన విశ్వంలోని వింతైన...
విచిత్రమైన ఓ ప్రకృతిధర్మమని...ఓ సృష్టిమర్మమని..