శూలాలు గుచ్చుకున్నా
సునామీలు ముంచెత్తినా
సుత్తి దెబ్బలెన్ని తగిలినా
అగ్నిపర్వతాలు బద్దలైనా
అగ్ని జ్వాలలు రేగినా
నెత్తిన పిడుగులు పడినా
ఎంతటి చింతనైనా ఒత్తిడినైనా
అంతులేని మానసిక క్షోభనైనా
తట్టుకోగలరు భరించగలరు
చెక్కు చెదరని చలించని
స్థితప్రజ్ఞులు తపస్సంపన్నులు
వీరులు ధీరులు విక్రమార్కులు
చపలచిత్తులు బలహీనులు మాత్రం
ఊరికే కుమిలిపోతారు కృంగిపోతారు
మనోవేదనతో మంచాన పడతారు
చచ్చి సాధించేది ఏమీ లేదనితెలిసినా
ఆత్మహత్యల అంచులు దాకా వెళ్తారు
అట్టి బలహీనులకెందరో
ఒత్తిడిని జయించే శక్తినిచ్చే
అమృతంలాంటి దివ్యౌషధంలాంటి
ఆత్మస్థైర్యాన్ని అందరికీ అందించి
ఆదుకొని ఎందరికో ప్రాణదానం చేసి
తానుసైతం ఓ పిరికివానిలా ఓ పిచ్చివానిలా
ఓ బలహీనుడిలా... ఓ బాధ్యత లేనివాడిలా
ప్రేమపరీక్షలో ఫెయిలైన ఓకాలేజీ కుర్రాడిలా
ఘోరమైన అతిదారుణమైన
ఒక తప్పుడు నిర్ణయం తీసుకునినదిలోదూకి
ఆత్మహత్య చేసుకున్నాడో అపరమేధావి ఆవేశంలో...
ఔను ఆ మరణం వెనుక మర్మమేమిటో
ఒత్తిడి చేతిలో తాను చిత్తుగా ఓడిపోవడమా?
అది అంతుచిక్కని ఆ పరమాత్మ నిర్ణయమా ?
లేక ఆ విధి ఆడిన వింతనాటకమా ?
ఏమో ఎవరికెరుక? కనిపించని ఆదైవానికి తప్ప....



