హఠాత్తుగా
ఒక పిడుగు నెత్తిన పడినట్లు
అకస్మాత్తుగా
ఒక సునామీ ముంచెత్తినట్లు
కోరింది తింటూ
నచ్చిన పనులు చేసుకుంటూ
హాయిగా తృప్తిగా
ఆనందంగా ఆరోగ్యాంగా వుంటూ
పిల్లల బంగారు భవిష్యత్తుకై
కమ్మని కలలు కంటూ
కబుర్లు చెబుతూ చెబుతూ
నవ్వుతూ నలుగురితో కలిసి
తిరుగుతూ
మంచిగా అందరితో మాట్లాడుతూ
ఉన్నపళంగా ఊపిరి వదిలి
కళ్ళముందే నీవు కన్నుమూస్తే
భూలోకంలో నీ ఖాతా క్లోజ్ చేస్తే
పరలోకంలో తలుపులు తెరిస్తే
పరమాత్మ నుండి నీకు పిలుపు వస్తే,ఇక
ఎన్ని కోట్ల ఆస్తులు ఆర్జించిననేమి
ఎంత డబ్బు సంపాదించిననేమి?
ఎన్ని బ్యాంకు ఖాతాలున్ననేమి?
కోట్ల ధనమున్ననేమి?
బ్యాంకులాకర్లలోఎంత బంగారమున్ననేమి?
ఇష్టమైన ఖరీదైన వస్తువులు
కళ్ళముందే ఎన్ని వున్ననేమి ? అన్నీ వదిలి
ఖాళీ చేతులతో కాటికి వెళ్ళక తప్పదుగా
నీకిష్టమైన ఎన్నో రకాల రుచికరమైన పదార్థాలు
కళ్ళముందే ఎన్ని వున్ననేమి ? అన్నీ వదిలి
ఖాళీ కడుపుతో కాటికి వెళ్ళక తప్పదుగా
ఔను , నిన్న రాత్రి వున్న మనిషి
నేడు తెల్లవారగానే మాయమైపోవచ్చు
ఔను అశాశ్వతమైన ఈ మనిషి ప్రాణం
ఒక నీటి బుడగలా పేలిపోవచ్చు
ఒక పచ్చని చెట్టులా కూలిపోవచ్చు
ఒక అఖండ జ్యోతిలా ఆరిపోవచ్చు
ఒక అందమైన పువ్వులా రాలిపోవచ్చు
మరలిరాని లోకాలకు తరలి పోవచ్చు
రేపేమి జరుగుతుందో ఎవరికెరుక
పైన దాగివున్న ఆ పరమాత్మకు తప్ప



