Facebook Twitter
ఆ అతీంద్రియశక్తి ఏదో?

నిన్న బిగ్గరగా 

నవ్విన కలిసి 

ప్రేమగా మాట్లాడిన  

జీవితమంటే 

ఒక నీటిబుడగని

అది ఏక్షణమైనా 

మాయమౌతుందని

చెప్పిన మనిషే నేడు 

మాయమైపోయాడు

కనిపించని కరోనా 

రక్కసి మాటేసి కాటేసి

 

తెల్లవారినా కళ్ళుతెరవకపోతే

ప్రపంచానికి ఎంతో ప్రాణాధారమైన 

సూర్యుడు సైతం కన్నుమూసి పడివున్న 

ఆ కట్టెకు ఇంతప్రాణం పోయలేకపోయాడు

 

ఔను ఈ సూర్యచంద్రుల కన్న 

శక్తివంతమైన మనిషితో పాటు 

ఆ గ్రహాలను సమస్తసృష్టిని నియంత్రించే 

అతీంద్రియశక్తి ఏదో విశ్వంలో దాగిఉన్నది

 

ఈ సూర్యచంద్రులు మనిషి 

పుట్టిన నాటినుండి గిట్టేవరకు 

ఆహారాన్ని నిద్రను నీడనివ్వగలరేమో కాని 

చనిపోయిన మనిషి కింత ఊపిరినిపోయలేరు

 

పండిన ప్రతిపండు ఎండిన ప్రతిఆకు 

రాలి పోక ధూళిలో కలిసి పోక తప్పదు 

మట్టిలో పుట్టిన ఈ మనిషి మళ్ళీ 

కన్నుమూసి కట్టై కాలి మట్టై పోవలసిందే 

కళ్ళముందే మంచులా కరిగి పోవలసిందే

తిరిగిరానిలోకాలకు తరలిపోవలసిందే తప్పదు 

ఇదిప్రకృతి ధర్మం సృష్టిమర్మం అంతుచిక్కని ఓరహస్యం