Facebook Twitter
కాల మహిమ....

ఈ కాలచక్రం ...

గిర్రున తిరుగుతుంది

కాలాన్ని కాదనే వారికి

కాలాన్ని కాలదన్నే వారికి కష్టాలే,నష్టాలే

 

ఈ కాలం ఆగి ఆగి సాగే ఒక రైలుబండి

నీ స్టేషన్ వస్తే ఎక్కు, నీ స్టేషన్ వస్తే దిగిపో

నీవు కొన్న ఆ టికెట్ నీవు దిగే స్టేషన్ వరకే

ఈ జీవనయాత్ర బొందిలో ఆ ఊపిరున్నంతవరకే

 

ఈ కాలం నీవు ఎక్కలేనని ఎత్తైన కొండ

ఈ కాలం నీవు మోయలేని బరువైన బండ

ఈ కాలం ఆరక రగిలే ఒక అగ్నిగుండం

ఈ కాలం నిరంతరం ప్రవహించే ఒక జీవనది

 

ఈ కాలం

ఖరీదైన ఒక కోహినూర్ వజ్రం

ఈ కాలం వెంట పరుగెత్తక తప్పదు

కళ్ళెంలేని గుర్రమైనా స్వారీ చేయక తప్పదు

 

కనిపించని ఈ కాలంతో యుద్దమెందుకు ?

కాలంతో స్నేహంచెయ్ వద్దు శత్రుత్వం వద్దు

 

కాలమే సర్వస్వం సర్వేశ్వర ప్రతిరూపం

కాలం పెట్టే ప్రతి అగ్నిపరీక్షలో నీవు

ఒక రోగివి కావచ్చు...ఒక భోగివి కావచ్చు

ఒక యోగివి కావచ్చు...ఒక త్యాగివి కావచ్చు

 

ఇందుకు పునాది

నీ ఆలోచనలు కావచ్చు...

నీ ప్రయత్నాలు కావచ్చు...

నీవు వేసే అడుగులు కావచ్చు...

నీవు చేసే నిత్యకర్మలు కావచ్చు...

నీవు తీసుకునే నిర్ణయాలు కావచ్చు...

కాలం నిజానికి అర్థంకాని ఒక ఇంద్రజాలం...