Facebook Twitter
నాగులచవితి పర్వదినం...

నమస్తే దేవ దేవేశ ! 

నమస్తే ధరణీధర !

నమస్తే సర్వ నాగేంద్ర ! 

ఆదిశేష నమోస్తుతే! 

అని నాగులచవితి నాడు 

నాగదేవతకు పుట్టలో 

పాలుపోసి పూజించిన 

వారికి తప్పక పుణ్యం దక్కును

 

ప్రకృతిలోని సమస్త

ప్రాణకోటి దైవస్వరూపాలే

సూర్యచంద్ర నక్షత్రాలు 

నదులు పర్వతాలు సప్తసముద్రాలు 

రాయి రప్ప కొండ కోన చెట్టు పుట్ట

ఇదే మన భారతీయ సంస్కృతి 

 

రైతుల పంటలకు

శత్రువులు క్రిమికీటకాలు

వాటికి శత్రువులు మన నాగదేవతలు 

రాత్రిపూట రైతుల పంటపొలాలని

 పహారాకాస్తూ పంటలను ధ్వంసంచేసే

క్రిమికీటకాదుల్ని మట్టుపెట్టే

వీరసైనికులే పుట్టలోని మన నాగదేవతలు

 

ఇంటికి శతృవు ఓ అగ్గికణం

అడవికి శతృవు కార్చిచ్చు 

మనిషి శరీరానికి 

శతృవులు నయంకాని 

మొండి వ్యాధులు 

మన అంతరంగాన్ని 

అల్లకల్లోలం చేసి మనిషిని 

మానసిక వ్యాధులకు 

మనోవేదనలకు గురిచేసే

అంతర్గత శతృవులే అరిషడ్వర్గాలు

 

మన దేహం ఎముకలగుట్ట 

మన అంతరంగం పాములపుట్ట 

మనలోని ఆ విషసర్పాలే

కామం... క్రోధం...లోభం...

మోహం... మదం... మాత్సర్యం 

అవి సత్త్వగుణాన్ని హరించేస్తాయి 

రజో తమోగుణాలను రగిలించేస్తాయి 

 

ఈ విషసర్పాలే శ్వేతవర్ణంలో 

ఆదివిష్ణువు పవళించే 

శేషపాన్పూగా మారాలని, 

మనుషులంతా 

సుఖశాంతులతో వర్థిల్లాలని

వారికి ప్రశాంతమైన 

జీవితాలను ప్రసాదించాలని 

పుట్టలో పాలుపోసి చేసే 

పూజే ఈ నాగులచవితి పర్వదినం