అడవి పూల అందం
అడవిన గాచిన వెన్నెల
ఒక్కటేనట...
పూలతోటల్లో
పూసిన పూలన్నీ
మార్కెట్లకేనట...
లక్షాధికారులైన తోట
యజమానులందరినీ
కోటీశ్వరులను చేసేందుకేనట...
కొన్ని పూలు ఇళ్ళకు చేరేది
మగువల ముంగురులు తాకి
మురిసేందుకేనట...
పడకగదిలో ప్రేమికులకు
పరిమళాలను పంచేందుకేనట...
గుడిని చేరి దైవం
మెడలోని పూలహారంలో దూరి
పరమాత్మ పాదాలను తాకి
పులకించిపోయే పువ్వుల జన్మసార్థకమే...
కానీ విస్మయం విచారమొక్కటే
అభయారణ్యంలో పుట్టే
అందమైన ఆ పువ్వులు వెజల్లే ...
ఆ పరిమళాలను ఆస్వాదించేదెవరు?
అవి ఎండకు ఎండి వానకు తడిసి
ఏ గాలివీచి ఎటు ఎగిరిపోతాయో...
ఏ దుమ్ములో...ఏ ధూళిలో కలిసి
ఎప్పుడు మాయమౌతాయో ఎవరికెరుక
ఐనా వసంత ఋతువు రాగానే
పూల మొక్కలన్నీ
చక్కని పూలను పూస్తునే ఉంటాయి
ఆ సృష్టికర్త ఆజ్ఞలను...
ఆ ప్రకృతి నియమాలను ధిక్కరించక...
అదే ప్రకృతి ధర్మమంటే...
అదే సృష్టికర్త శాసనమంటే...



