ఎడారి గుండెలో ఏముందో?
నీవు ఉప్పువని తెలుసు
నేను నిప్పని తెలుసు
నీకు నాకు పడదని తెలుసు
నాడు నీవు
ఆరబోసిన అందాలన్ని
నేడు
ఆరిపోయే దీపాలయ్యాయి
వాడిపోయే పూలయ్యాయి
అక్కరకు
రాని అందాలను
లెక్క వేసుకుంటూ
ముక్కలైన బంధాలను
ఏరుకుంటు ఎళ్తున్నావు
మూడుముళ్ల బంధం
మూడునాళ్ళ
ముచ్చటైనందుకు
అనుబంధాలు
ముళ్ళమీద ఆరేసుకున్న
పట్టువస్త్రాలైనందుకు
...నాకు బాధలేదు
నిప్పులాంటి నీ నిర్దయ
నన్ను నిట్టనిలువునా
దహించి వేసింది
...ఐనా నాకు బాధలేదు
నీ చూపులు చురకత్తులై
నీ చేదుజ్ఞాపకాలు గునపాలై
గుండెల్లో గుచ్చుకున్నాయి
...ఐనా నాకు బాధలేదు
ఇక నాకు కన్నీళ్లు
రావడం లేదు ఏనాడో ఇంకి
...ఇసుక రేణువులయ్యాయి
నా ఎడారిగుండె నీ తలపులతో
ఒక పూలతోటై మళ్ళీ విరిసింది
మనసులో ప్రేమవాన కురిసింది
ఎందుకో ఏమో వింతగా వుంది
....ఆ విధిలీల నమ్మలేకున్నాను



