Facebook Twitter
జాలర్ల వింత జాతకాలు..?

జాలర్ల వింత జాతకాలు..?
కలలు కనడం తెలియదు
పాపం వలలు విసరడం తప్ప
అలల మీద స్వారీ చేయడం తప్ప
పట్టిన చేపలు బుట్టలో వేసుకోవడం తప్ప
ఇక సుఖజీవనమెక్కడిది సునామీలు తప్ప 

ఆ కడలిలోని ఆ నీటికన్న
ఆ మత్స్యకారులు కార్చిన కన్నీరే మిన్న...
వారి బడుగు బ్రతుకులు నీటి బుడగలే...
కష్టాలు కన్నీళ్లు పగబట్టిన పాముపడగలే...
వారి బ్రతుకులు దినదిన గండమే...
సుడిగుండాలతో నిరంతర సహవాసమే...
ప్రమాదకరమైన అంచుల్లో పగలురేయి
సాహసోపేతమైన సముద్ర ప్రయాణమే...

సముద్రం అల్లకల్లోలమైతే
బ్రతుకుల్లో రేగేది తీవ్రతుఫానులే...
చుట్టుముట్టేది సమస్యలసునామీలే...
సాగరంలోనే కాదు సంసారంలోను
అగని అలల...కలల కన్నీటి అలజడులే...

సముద్రంలో వేటకెళ్లి తిరిగొచ్చేంతవరకు
"మత్స్యకారుని ఇంట మృత్యు ఘోషే"...
ఆ కుటుంబమంతా మునిగి తేలేనిది
సంతోష సంబరాల స్వర్గసీమలో కాదు
ఖణఖణమండే ఆశల అగ్నిజ్వాలల్లో...
అర్థంకాని...అదృశ్య నరకకూపంలో...
పాపం ఏ దైవం జాలిచూపని ఆ జాలర్ల...
జాతకాలే అంత...వారి జీవితాలే వింత...

ఓ దైవమా ! ఎప్పుడు ? ఎప్పుడు..?
బాగుపడేను ఈ జాలర్ల జీవితాలు ?
వారి వలలకెప్పుడు వసంతకాలం..?
వారి కలలకెప్పుడు కళ్యాణశోభ....?