ఈ మధ్య
కవి సమ్మేళనాలు
కొన్ని బ్రేక్ ఫాస్ట్ లా
కొన్ని హాఫ్ మీల్స్ లా
కొన్ని ఫుల్ మీల్స్ లా
కొన్ని ఫాస్ట్ ఫుడ్ లా
తూతూమంత్రాలే...
ఎంతో ఆశతో
ఎంతో దూరం నుండి
ఎంతో ఖర్చు చేసుకుని
విలువైన సమయాన్ని
వెచ్చించి
ముఖ్యమైన పనులన్నీ
ప్రక్కకు నెట్టి
ఆగమేఘాల మీద
ఉరుకు పరుగులతో
కవి సమ్మేళనానికొస్తే
"అదృష్టం"
ఆహ్వానం పలికితే
వేదిక నెక్కవచ్చు
కవితాగానం చేసే
అవకాశం దక్కవచ్చు
"దురదృష్టం"...
ఆహ్వానం పలికితే
ఆలస్యమైనందున
కవితా గానం చేసే
అవకాశం చేజారిపోవొచ్చు
కవి సమ్మేళనాల్లో
కవులతో పాటు
సాహితీ మూర్తుల
ముందు
"కవితా గానం" చేస్తే
లక్కీలాటరీ
ఒకటి తగిలినట్లే...
కవిత చదవడం...
కవికి...ఒక నిశ్చితార్థం
సన్మానం జరగడం...
కవికి ఒక కళ్యాణ శోభే....
మూడు నిమిషాల
కవితగానం...
ఆపై స్వాతివాన కోసం
ముత్యపు చిప్పలా...
మూడు గంటల...
పడిగాపులు
చిరుసన్మానం కోసం...
ఆపై ఎవరెన్ని
అద్భుతమైన
ప్రసంగాలు చేస్తున్నా
ఉపన్యాసాలిస్తున్నా
సెల్లో మునిగి తేలడం
సన్మానం కోసం
కొండంత ఆశతో
ఎదురు చూడటం...ఆపై
ఇంటికి పరుగులు పెట్టడం
కవి సమ్మేళనాలకు
ఖర్చు బారెడు...
తృప్తి మూరెడు...
ఈనాటి కవిసమ్మేళనాల
వెనుక ఏ స్వార్థం దాగుందో
ఎంతకూ అర్థం కాకుంది
హాల్ కళకళలాడడం కోసమే
పుస్తకావిష్కరణలకు
కవి సమ్మేళనాలు.



