జై తెలుగు..! జైజై తెలుగు....!
జయహో జయహో తెలుగు..!
నా తెలుగు...నాకు వెలుగు...!
నా తెలుగు...నీతికి వెలుగు...!
నా తెలుగు...జాతికి వెలుగు..!
నా తెలుగు...ప్రగతికి వెలుగు..!
నా తెలుగు...జగతికి వెలుగు..!
నా తెలుగు జాతి...
అపురూపం... అది
ప్రేమకు ప్రతిరూపం..!
అది అల్లూరి ఆవేశానికి
పల్నాటి పౌరుషానికి ప్రతిబింబం..!
నా తియ్యని
తేనియల తెలుగు...
కోటి అందాల కోన సీమ..!
రాగిముద్దల రాయల సీమ..!
రామప్పగుడిలో
మ్రోగే రసరాగ తరంగిణి
రామ్యరాగాల తెలంగాణ రుద్రవీణ..!
నా తెలుగు నేల...
గలగలపారే గంగా గోదావరి
కృష్ణ కావేరీ నదుల సంగమం..!
నా తెలుగు భాష నాకు వరం..!
అది విశ్వానికి వెలుగు కిరణం..!
నా తెలుగు భాష సొగసు...
తిరుమలగిరి సుందర మందిరాన
శ్రీ బాలాజీకి దిద్దిన శ్రీహరి తిలకం..!
నా తెలుగుతల్లి చల్లని ఒడి...
నాకు ఒక గుడి నాకు ఒక బడి..!
అది పచ్చదనాల సమతా మమతల
సస్యశ్యామల నవజీవన నారుమడి..!
నా ప్రతి తెలుగుపదం...
నవనీతం నవరస భరితం..! అది
త్యాగయ్య క్షేత్రయ్య అన్నమయ్య
కీర్తనల్లో పల్లవించే ప్రణవనాదం..!
నా తెలుగు వైభవం...
నన్నయ్య తిక్కన ఎర్రా ప్రగడల
పోతన వేమన శ్రీనాధ విశ్వనాథ
గిడుగు గుర్రం జాషువా గురజాడ
శ్రీశ్రీ సినారే ఆత్రేయ దాశరథి
కావ్యకన్యల సుగంధ సౌరభం..!
నా తెలుగు జాతి...
కీర్తిప్రతిష్టలు...విశ్వ వేదికలపై
నర్తించు నటరాజు మువ్వలసవ్వడులు..!
నా తెలుగు యాసలో...ఎన్నెన్ని హైదరాబాద్ బిర్యానీ ఘుమఘుమలో..!
ఎన్నెన్ని ముత్యాల వజ్రాల మిళమిళలో..!
నా తెలుగు అక్షరం...నవ్వే నక్షత్రం..!
విశ్వ విహంగం..! ప్రేమ పతంగం..!
గలగల పారే గంగా ప్రవాహం..!
గగనసీమలో వినిపించు గంధర్వగానం..!
ఖండాంతరాలలో ఎగిరే శాంతికపోతం...!



