సరస్వతీ దేవికి
ముద్దుల కూతుర్లు ముగ్గురు
ఒకరు సంగీతంలో...
ఒకరు సాహిత్యంలో...
ఒకరు గానంలో దిట్టలు...
కాని వారి అంతరంగాన
అందరికన్నా నేనే మిన్ననే
అహం అగ్నిలా రగులుకుంది...
ఒకరంటారు...
నా సాహిత్యంలో
అక్షరాలు ఆకాశంలో
వెలుగులు విరజిమ్మే నక్షత్రాలని...
అన్ని సామాజిక రుగ్మతలకు
సాహిత్యమే
సంజీవినియని...నేనే గొప్పని..
ఒకరంటారు...
నా సంగీతం
ఒక మహాసాగరమని...
ఆ రసఝరిలో మునులు సైతం
మునిగి తేలెదరని...నేనే గొప్పని...
ఒకరంటారు...
నా గానం గంధర్వ గానం
అది వీనులకు విందని...
మనసుకు పసందని...స్వరం నాకు
దైవమిచ్చిన వరమని... నేనే గొప్పని...
ఔను ఎవరు గొప్ప...
ఎవరికెరుక పైనున్న
ఆ పరమాత్మకు తప్ప...
ఈ తగవు తల్లి సరస్వతిదేవి
చెంతకు చేరింది...ఖంగుతిన్న
సరస్వతీ దేవి బిడ్డలారా...
మీకు కొన్ని ప్రశ్నలు...
బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో
ఎవరు గొప్పవారు..?
సృష్టి స్థితి లయ లలో ఏది గొప్పది..?
పంచభూతాలతో ఏ శక్తి గొప్పది..?
మన శరీరంలో
ఏ అవయవం గొప్పది..?
బైబిల్ ఖురాన్ భగవద్గీతలలో
ఏది పవిత్రమైన గ్రంథం..?
అన్నిటి సారం ఒక్కటి కాదా...?
అందరు దేవుళ్ళు ఒక్కటి కాదా?
ఒకరు సాహిత్య సృష్టి చేస్తేనే...
ఒకరు సుమధుర
సంగీతం సమకూర్చితేనే...
ఒకరు తమ గంభీరమైన
గాత్రంతో గానం చేస్తేనే కదా...
ఆ మూడు ఒక్కటైతేనే కదా...
తేనెల వానలు కురిసేది...
పశువులు శిశువులు పరవశించేది...
శ్రోతలు మైమరచేది...
మత్తులో మునిగితేలేది...
అని ఆ సర్వతీదేవి పలకగానే...
ఆ ముగ్గురికి జ్ఞానోదయమైంది
ముగ్గురు వేరువేరు కాదని ఒక్కటేనని
సరస్వతీ దేవి కల్పవృక్షానికి
కనిపించని వేర్లను...
తామే ఆత్మ...జీవాత్మ...
పరమాత్మలకు...ప్రతిరూపాలని...
ముగ్గురూ ఒకే కొమ్మ పువ్వులని...
ఎవరి కంటే ఎవరు గొప్పవారు కాదని...



