నీవు దిక్కుతోచక గందరగోళంలో
గాఢాంధకారంలో వున్నావని
చిమ్మచీకటిలో కూర్చున్నావని
కళ్ళముందున్న వస్తువేది కనిపించక
ఇంటిలో ఇబ్బంది పడుతున్నావని
ఆ దైవం నీకు అడగక్కుండానే
ఒక అగ్గిపెట్టెనిచ్చాడు
అందులో అగ్గిపుల్లల నిచ్చాడు
ఒక క్యాండిల్ నిచ్చాడు
దానికి ఒత్తిని కూడా ఇచ్చాడు
ఇంకేమి కావాలి నీకు?
ఇంకా ఎందుకు చీకటిలోనే
చింతిస్తూ కూర్చున్నావు?
ఎవరికోసం ఎదురు చూస్తున్నావు ?
చేతిలోని క్యాండిల్
ఎవరైనా వచ్చి వెలిగిస్తె బావుండని
ఎవరికోసమో ఎదురు చూస్తున్నావు
అగ్గిపెట్టె క్యాండిల్ ఇచ్చిన దేవుణ్ణే
వచ్చి వెలిగించమని వేడుకుంటున్నావే
అర్థిస్తున్నావే ప్రార్ధిస్తున్నావే
నీవెంతటి వెర్రివాడివి !
ఎంతటి అఙ్ఞానివి! ఎంతటి అమాయకిడివి!
రెక్కలిచ్చింది ఎందుకు?
ఎగరమని కాదా
మెట్లుపెట్టింది ఎందుకు?
ఎక్కమని కాదా
కాళ్లూ చేతులిచ్చింది ఎందుకు?
కష్టపడమని కాదా
అగ్గిపెట్టె నిచ్చింది ఎందుకు?
వెలిగించమని కాదా
అందుకే ఓ అవివేకీ !ఇక ఆలోచనదేనికి?
వెలిగించి క్యాండిల్ వెలుగులు నింపుకో
ఇక చీకటంటూ వుండదు నీ ఇంటిలో
ఇక చింతంటూ వుండదు నీ చిత్తంలో
మీ జీవితం మెప్పుడూ
ఇలా పచ్చగా ఉండాలంటే
ముందు మీ మనసు
మల్లెలా స్వచ్ఛంగా
మంచులా చల్లంగా ఉండాలి
మీ జీవితం మెప్పుడూ
ఇలా పచ్చగా ఉండాలంటే
మీ మనసెప్పుడూ
నిర్మలంగా నిశ్చలంగా
నిష్కల్మషంగా ఉండాలి
మీ జీవితం మెప్పుడూ
ఇలా పచ్చగా ఉండాలంటే
మీరెప్పుడూ
నీతిగా ఉండాలి
నిప్పులామండాలి
అప్పుడే మీ జీవితంలో
ఈ పచ్చదనం ఎప్పుడూ వుంటుంది



