ఘనుడు త్యాగదనుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్
- తన రక్తాన్ని ధారబోసి...
రక్షణకవచం లాంటి
భారత రాజ్యాంగాన్ని వ్రాసి...
మహిళల హక్కులకోసం
హిందూ కోడ్ బిల్లు ఆమోదంలో
"నా నూతన కేబినెట్ లో
ఆణిముత్యం అంబేద్కర్" అన్న
ప్రధాని నెహ్రూతోనే విభేదించి
న్యాయశాఖమంత్రిగా రాజీనామా చేసి
గాంధీజీ కుట్రలు కుతంత్రాలు నచ్చక
జాతీయ కాంగ్రెస్ లో ఇమడలేక...
అడుగునున్న
బడుగులందరి
అభివృద్ధి కోసం ...
ఆత్మ గౌరవం కోసం...
కులనిర్మూలన కోసం ...
మనిషి మనిషి
మధ్య మంటలు రేపే
మనుధర్మ శాస్త్రాన్ని కాల్చివేసి...
అంటరానివారి
ఆలయ ప్రవేశం కోసం
మహద్ చెరువులో నీళ్ళకోసం
రిపబ్లికన్ పార్టీని స్థాపించి...
ఒక్కడే ఒక సైన్యమై
రాజకీయంగా పోరాటాలెన్నో చేస్తూ
ఎన్నో సభలలో సమావేశాలలో
వందల వేల ప్రసంగాలు చేసి ...
బడుగు బలహీన వర్గాల
అభ్యున్నతికి విశేషమైన కృషి చేసి...
ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి
తన రక్తాన్ని స్వేదంగా మార్చి
ప్రపంచంలోని ప్రజాస్వామ్య
దేశాధినేతలే నివ్వెరపోయేలా
రాజ్యాంగ రచనచేసి...
రక్షణలెన్నో కల్పించి..హ
బహుజనుల బ్రతుకుల్లో
వెన్నెల వెలుగులు నింపిన...
ఓ జాతినేత...అందరివాడు...
అపరమేధావి...ఆత్మబంధువు...
జ్ఞానసూర్యుడు...విశ్వమానవుడు...
పోరాటయోధుడు...
ఉద్యమాల యుద్ధనౌక...
బహుముఖ ప్రజ్ఞాశాలి...
భారత రాజ్యాంగ నిర్మాత...
భావిభారత స్పూర్తి ప్రదాత...
అణగారిన వర్గాల ఆశాజ్యోతి...
చదువులమ్మ ముద్దుల తనయుడు...
ఓ భారత రత్న అమరజీవి అంబేద్కరా...
మీ కిదే మా అక్షర నీరాజనం...



