Facebook Twitter
అంబేద్కర్ ఒక విజ్ఞాన గని

  • మంచితనం
    మానవత్వమున్న
    బరోడా మహారాజు
    ఉదారహృదయంతో
    అమృతహస్తాలతో ఆశీర్వదించి
    అందించిన స్కాలర్ షిప్ తో
    భార్యాపిల్లలను ఊరిలో వదిలేసి
    ఒంటరిగా ఓడల్లో విదేశాలకేగి...



కసితో కృషితో...
ఒక ఆశయంతో...
గట్టి పట్టుదలతో...
తెల్లదొరల మధ్య సూటు బూటు
వేసుకొని "తెల్లనికొంగై"తిరుగుతూ
సనాతన భారతాన తనను
సంస్కృతం చదవనివ్వకున్నా...

ఇంగ్లీష్ విద్యలో పట్టును సాధించి
విదేశాల్లో విశ్వవిద్యాలయాల్లో
ఆర్థిక...రాజకీయ...గ్రంధాలను
న్యాయ...తత్త్వ...శాస్త్రాలను
రాత్రింబవళ్ళు ఔపాసన బట్టి
ఉన్నత విద్యను ఆర్జించి...

ఇటు భారత దేశంలోను 
అటు ప్రపంచంలోను
సకల సౌకర్యాలున్న
ధనవంతుల శ్రీమంతుల
అగ్రవర్ణాల విద్యార్థులెవరూ
కలలోనైనా ఊహించని
తమ జీవితాల్లో సాధించలేని
డిగ్రీలెన్నిటినో సాధించి...

నిద్రాహారాలు మాని ఏళ్ళతరబడి
పురాతన గ్రంధాలను పరిశోధించి
ఏ బహుభాషా పండితులు సైతం
వ్రాయలేనన్ని అతివిలువైన
విజ్ఞానదాయకమైన బృహత్
గ్రంథాలను భావితరాలకోసం వ్రాసిన
చరిత్రగదిలో రహస్యనిధిలా దాచిన
అపర మేధావి...విజ్ఞాన గని అంబేద్కర్

ఓ జాతినేతా...
ఓ అందరివాడా...
ఓ ఆత్మబంధువా...
ఓ జ్ఞానసూర్యుడా...
ఓ విశ్వమానవుడా...
ఓ పోరాటయోధుడా...
ఓ బహుముఖ ప్రజ్ఞాశాలీ...
ఓ ఉద్యమాల యుద్ధనౌకా...
ఓ భారత రాజ్యాంగ నిర్మాతా...
ఓ భావిభారత స్పూర్తి ప్రదాతా...
ఓ అణగారిన వర్గాల ఆశాజ్యోతీ...
ఓ చదువులమ్మ ముద్దుల తనయుడా...
ఓ భారతరత్న అమరజీవి‌ అంబేద్కరా...
రాజ్యాంగంసాక్షిగా మీకిదే మా అక్షరాంజలి