ఓ బహుజన బిడ్డలారా..!
ఆయా తేదీల్లో ఆ శుభ ఘడియల్లో
ఆ మహాత్ములే...
ఆ పుణ్యాత్ములే...ఆ మహనీయులే...
ఆ త్యాగధనులే...
ఆ దీనజన బాంధవులే...
మహాత్మా జ్యోతిరావు ఫూలే
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ లే
పుట్టకపోయి వుంటే...
ఈ జాతి జాగృతి కోసం
కలం పట్టకపోయి వుంటే...
గళం విప్పకపోయి ఉంటే...
పులులై గర్జించకపోయి ఉంటే...
సింహాలై గాండ్రించకపోయి ఉంటే...
మనువాదులతో పోరాడకపోయి ఉంటే...
కాటువేసే ఆ కులసర్పాలను
సంహరించకపోయి వుంటే...
సమాధి చేయకపోయి ఉంటే...
ఇంకా ఎవరో వస్తారని...
ఏదో చేస్తారని ఎదురు చూసే...
నేటి ఈ బహుజనుల
బ్రతుకులు ఎలాగుండేవో..?
ఏమైవుండేవో ఎవరికెరుక..?
అమరుడైన అంబేద్కర్ కు తప్ప...
పైనున్న ఆ పరమాత్మకు తప్ప....
ఓ బహుజన బిడ్డలారా..!
ఏకులుగా పుట్టిన
మీరు మేకులయ్యేవారా..?
బాకులుగా పుట్టిన
మీరు మరతుపాకులయ్యేవారా..?
ఊరిచివర పూరి గుడిశలో పుట్టిన
మీరు పులులయ్యే వారా..?
కర్ణకఠోరంగా కాకుల్లాగా అరిచే
మీరు కోకిల రాగాలు తీసేవారా..?
కడుపునిండా తిండిలేక
ఆకలికి అలమటించే మీరు
కటిక దారిద్ర్యాన్ని అనుభవించే
మీరు కలెక్టర్లయ్యేవారా...?
దళితజాతి హక్కులకోసం
ఒంటరి పోరాటం చేసిన...
సర్వస్వం త్యాగం చేసిన...
తమ ప్రాణాలనే ఫణంగా పెట్టిన దళితబంధువులు
అమర జీవులు...
ఆ జ్యోతిరావు ఫూలే...
ఆ బాబా సాహెబ్ అంబేద్కర్ ల...
స్మరణే మీకు ఒక ప్రేరణ
వారి ఆశయాల సాధనకోసం...
దళితజాతి రాజ్యాధికారం కోసం...
సమ సమాజ స్థాపనకోసం...
నిరంతరం పోరాడాలి...కడకు
ప్రాణార్పణకైనా సిద్దమవ్వాలి...జై భీం...



