ఓ దేవుళ్ళళ్ళారా దేవతలారా
వేసిన తాళాలు తీసుకోలేక
మూసిన తలుపులు తెరుచుకోలేక
మీరెక్కడ దాక్కున్నారో ఏమో,కాని
గుళ్ళల్లో తిరిగే గుడ్లగూబలు సైతం
మా బాధలు చూసి గుండెలు బాదుకున్నాయి
మీరు మాత్రం, కరోనా రక్కసి కోరల్లో చిక్కుకున్న
మాపై కాసింతైన జాలి కనికరం చూపించలేదాయే
ఆ కరోనా రాక్షసి ఎక్కడినుండో
ఉరుములా ఉరిమి,మెరుపులా మెరిసి
హఠాత్తుగా పిడుగులాపడి
మా జీవితాల్ని ఛిద్రం చేస్తుంటే
మా బ్రతుకుల్ని బండకేసి బాదిబాది
పిండిపిండి ఎండలో ఆరేస్తుంటే
మా పీకలు పిసికేస్తుంటే, ఊపిరాడక మేము
ఉక్కిరిబిక్కిరై పోతుంటే,మాఊపిరితీస్తుంటే
మాప్రాణాలను కరకర నమిలేస్తుంటే
కర్కశంగా మమ్ము కాటికీడుస్తుంటే
మీరెక్కడ దాక్కున్నారో అర్థం కాదాయే
మా కన్నీటి ప్రార్థనలు, మా ఆవేదనలు
మా ఆర్తనాదాలు మీ చెవులను తాకవాయే
ముక్కోటి దేవుళ్ళకు మొక్కినా
ఒక్కరూ ముందుకు రాకపాయే, అందుకే
ముందరే,మృత్యువు నిలుచున్నా
భయపడక, తిండితినక,కునుకుతియ్యక
ఉద్యోగమే మా ఊపిరంటూ
ఇంటికి దూరంగా వుంటూ
కంటికి రెప్పలా కాపాడుకుంటూ
కరోనా రోగులు మా కన్నబిడ్డలంటూ
ఆ యమదూతలనే ఎదిరించి
నిరంతరం నిస్వార్థంగా సేవలందించే
ఆ ప్రాణదాతలైన వైద్యులకు నర్సులకు
పోలీసుసిబ్బందికి పారిశుద్ధ్య కార్మికులకు
రండి రండి చెతులెత్తి మొక్కుదాం
రండి రండి కన్నీటితో వారి పాదాలకభిషేకంచేద్దాం
రండి రండి సంతోషంతో సంబరాలు చేసుకుందాం



